కేసులో కొత్త మలుపు
పుణెలో కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. నిందితురాలు సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి హత్యకు పాల్పడిందనే ఆరోపణలపై ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పుడు ఈ కేసులో మరో కొత్త కోణాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రైవేట్ కాల్స్, వ్యక్తిగత సందేశాలను ఆధారంగా చేసుకుని చేతన్ సియాను బ్లాక్‌మెయిల్ చేసి హత్యకు ఒత్తిడి చేశాడా అనే అంశంపై విచారణ సాగుతోంది. తొలి హత్యాయత్నంలో సియా పాత్రను బయటపెడతానని బెదిరించి కుట్రలో కొనసాగించాడా అనే కోణాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.
డబ్బు కోణంపైనా నిఘా
ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు కూడా కీలకంగా మారాయి. సియా బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. చేతన్ ప్రయాణాలు, నిఘా, ఇతర ఖర్చుల కోసం సియా పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ చేసిందా అనే అంశాన్ని పరిశోధిస్తున్నారు. వివాహం జరిగిన తర్వాత అగర్వాల్ కుటుంబ ఆస్తులను ఉపయోగించాలనే ఉద్దేశంతో చేతన్ హత్య ప్రణాళికను మార్చుకున్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. హత్యకు ముందు నగదు ఉపసంహరణలు జరిగాయా అనే విషయంపై ఫోరెన్సిక్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి.
పెళ్లికి ముందు దారుణం
సియా గోయల్, కేతన్ అగర్వాల్ నిశ్చితార్థం ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగింది. నవంబర్‌లో ఘనంగా వివాహం జరపాలని కుటుంబాలు ఏర్పాట్లు చేశాయి. జైపూర్‌లోని ఓ రాజభవనాన్ని భారీ మొత్తానికి బుక్ చేయడంతో పాటు అతిథుల కోసం ప్రత్యేక విమానాలను కూడా సిద్ధం చేశారు. అయితే జూన్ 14న లోహగడ్ కోటకు తీసుకెళ్లి కేతన్‌ను లోయలోకి నెట్టే ప్రయత్నం చేసినా అతడు పొదను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ సమయంలో పాము కనిపించిందంటూ సియా నాటకం ఆడి అనుమానాలు రాకుండా చూసిందని పోలీసులు చెబుతున్నారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ అదే కోటకు తీసుకెళ్లి చేతన్ సాయంతో వెనుక నుంచి తోసేయడంతో కేతన్ మృతి చెందినట్లు దర్యాప్తులో తేలింది.
ఒకరిపై ఒకరు ఆరోపణలు
మొదట బలమైన గాలుల కారణంగా ఫొటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయాడని భావించారు. అయితే ఘటన తర్వాత సియా ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. అనంతరం సియా, చేతన్ ఇద్దరినీ అరెస్టు చేశారు. విచారణలో ఇద్దరూ నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. తాజాగా ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించగా హత్యకు అసలు సూత్రధారి ఎదుటివారేనంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నట్లు తెలుస్తోంది. బ్లాక్‌మెయిల్, డబ్బు లావాదేవీలు, హత్య కుట్ర వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్న దానిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.











