- 17 ఏళ్ల షేక్ హెథీష్ శామ్యూల్‌ను చాకచక్యంగా ఒడ్డుకు చేర్చిన పోలీసులు
- సకాలంలో స్పందించి ప్రాథమిక చికిత్స అందించిన సిబ్బంది..
బాపట్ల,జూన్ 26(నాదేశం): ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరంలో శుక్రవారం ఒక పెను ప్రమాదం తప్పింది. సముద్ర స్నానానికి దిగి అలల ఉధృతికి కొట్టుకుపోతున్న ఒక యువకుడిని బాపట్ల మెరైన్ పోలీసులు, స్థానిక లైఫ్ గార్డ్ స్విమ్మర్స్ అత్యంత చాకచక్యంగా ప్రాణాలకు తెగించి కాపాడారు.
పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు నగరంలోని పాత గుంటూరు ప్రాంతానికి చెందిన షేక్ హెథీష్ శామ్యూల్ (17) తండ్రి మహమ్మద్ ఇంతియాజ్ తో కలిసి శుక్రవారం సెలవు దినం కావడంతో సూర్యలంక బీచ్‌కు విహారయాత్రకు వచ్చాడు. సరదాగా సముద్రంలో స్నానానికి దిగిన హెథీష్, అలల వేగాన్ని అంచనా వేయలేక ప్రమాదకరమైన లోతు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. చూస్తుండగానే అలల ఉధృతికి నీట మునుగుతూ, కొట్టుకుపోతూ ప్రాణాల కోసం కేకలు వేశాడు.
దానిని గమనించిన మెరైన్ పోలీసులు, స్థానిక స్విమ్మర్లు తక్షణమే అప్రమత్తమై లైఫ్ జాకెట్లతో సముద్రంలోకి వెళ్లి మునిగిపోతున్న హెథీష్ శామ్యూల్‌ను కాపాడి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
స్పృహతప్పే స్థితికి చేరుకోవడంతో, మెరైన్ సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు. సకాలంలో స్పందించి ఒక యువకుడి ప్రాణాన్ని నిలిపిన మెరైన్ సిబ్బందిని, స్విమ్మర్లను స్థానికులు అభినందించారు.
యువకుడిని కాపాడిన మెరైన్ ఎస్ఐ శ్రీనివాసరావు, సిబ్బంది శ్రీనివాస్ రెడ్డి, వాసు, మస్తాన్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, మరియు స్విమ్మర్లు వంశీ, చందు లను ఎస్పీ ఉమామహేశ్వర్ అభినందించారు. సముద్ర తీరంలో ప్రమాదాలు పొంచి ఉంటాయని, బీచ్‌లో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను, పోలీసుల సూచనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని.. ఎవరూ కూడా ప్రమాదకరమైన లోతు ప్రాంతాల్లోకి వెళ్లవద్దని ఎస్పీ హెచ్చరించారు.
#SuryalankaBeach #Bapatla #MarinePolice #BeachRescue #SeaRescue #LifeGuard #AndhraPradesh #BapatlaNews #BeachSafety #PublicSafety #EmergencyResponse #MarineSI #PoliceBravery #RescueOperation #BreakingNews #LatestNews #AndhraNews #SeaSafety #TeluguNews #Survival











