పోలవరంపై మాజీ మంత్రి అమర్నాథ్ విమర్శలు
వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రెండున్నరేళ్లుగా ప్రభుత్వం పనుల కంటే ఈవెంట్ మేనేజ్మెంట్కే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని పోలవరం ఎడమ కాలువలోకి విడుదల చేసి, పోలవరం నుంచి నీళ్లు వచ్చాయని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. పోలవరం కాలువ ప్యాకేజీల అంచనాలు పెంచి తనకు అనుకూలమైన వారికి కట్టబెట్టారని ఆరోపించారు. పోలవరం ఎత్తు 45 మీటర్ల నుంచి 41 మీటర్లకు తగ్గించేందుకు ఎందుకు అంగీకరించారని ప్రశ్నించారు. 41 మీటర్ల కాంటూరు వద్ద నీటిని నిల్వ చేస్తే ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతుందని తెలిసినా ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందని నిలదీశారు. చంద్రబాబు పాలనలో ఉత్తరాంధ్రకు తీసుకొచ్చిన ఒక్క కొత్త ప్రాజెక్టు పేరు చెప్పాలని డిమాండ్ చేశారు.
గ్రావిటీ నీళ్లే కావాలి
చంద్రబాబు వైఎస్ జగన్ భయంతో రాజకీయాలు చేస్తున్నారని, జగన్ పేరును పదేపదే ప్రస్తావిస్తూ కాలం గడుపుతున్నారని అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాల ఖర్చుతో మరో పోలవరం నిర్మించవచ్చని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి నేరుగా నీళ్లు ఇస్తున్నారా? పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా నీళ్లు ఇస్తున్నారా? అనే విషయాన్ని ప్రజలకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం కాలువకు ఎత్తిపోతల ద్వారా కాకుండా గ్రావిటీ ద్వారా నీరు అందించాల్సిందేనని అన్నారు. వైఎస్సార్ వర్ధంతి రోజున నీటిని విడుదల చేయడం దేవుడు రాసిన స్క్రిప్ట్లా ఉందంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం పనులు పూర్తి చేయలేకపోతే ఆ తప్పును ఉద్యోగులపై నెట్టేస్తోందని ఆరోపించారు. పోలవరం పేరుతో ప్రచారం కాకుండా ప్రాజెక్టును పూర్తి చేసి, ఉత్తరాంధ్రకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు.
#GudivadaAmarnath #ChandrababuNaidu #Polavaram #PolavaramProject #Purushothapatnam #GodavariWaters #NorthAndhra #PolavaramLeftCanal #GravityWater #IrrigationProjects #YSRCP #APPolitics #AndhraPradesh #PolavaramControversy











