‘నేతన్న సేవ’లో భారీ అక్రమాలు… అనర్హులకు దోచిపెట్టి.. కష్టజీవులకు అన్యాయం చేస్తారా..
వారం రోజుల్లో రూ. 25 వేలు జమ చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తాం
కూటమి ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ‘నేతన్న సేవ’ పథకం అమల్లో అక్రమాలు జరుగుతున్నాయని చీరాలలోని చేనేత మరియు జౌళి శాఖ కార్యాలయం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీరాల నియోజకవర్గ ఇన్చార్జ్ కరణం వెంకటేష్ బాబు ఆదేశాల మేరకు పార్టీ నాయకులు, చేనేత ప్రతినిధులు గురువారం ఆందోళన చేపట్టారు.
చేనేత వృత్తితో ఎలాంటి సంబంధం లేని వ్యక్తుల నుంచి ముడుపులు తీసుకుని, అనర్హులకు నేతన్న సేవ కింద రూ. 25 వేల చొప్పున లబ్ధి చేకూర్చారని ఆరోపిస్తున్నారు. రాత్రింబవళ్లు కష్టపడే నిజమైన చేనేత కార్మికులు తమ హక్కుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే అధికారులు బాధ్యతారాహిత్యంగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ‘నేతన్న నేస్తం’ పథకం కింద జియో ట్యాగింగ్ ద్వారా అత్యంత పారదర్శకంగా 84 వేల మంది అర్హులైన చేనేత కార్మికులకు ప్రతి ఏటా రూ. 24 వేలు అందించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు. నాటి పారదర్శక జాబితాను పక్కనబెట్టి, నేడు కొత్తగా అనర్హులకు కట్టబెట్టడం వెనుక ఉన్న అంతరార్థమేమిటని అధికారులను నిలదీశారు. అక్రమాలకు పాల్పడి అనర్హులకు లబ్ధి చేకూర్చిన అధికారులపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయించి బాధ్యులైన అధికారులపై ప్రైవేట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఈ వారంలోనే నేతన్న సేవ పథకం కింద రూ. 25 వేల ఆర్థిక సహాయాన్ని తక్షణమే జమ చేయాలని డిమాండ్ చేనేత జౌళి శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాంగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీరక సురేంద్ర, పట్టణ పార్టీ అధ్యక్షులు యాతం మేరి బాబు, వేటపాలెం మండల పార్టీ అధ్యక్షులు సాదు రాఘవ, బొడ్డు సుబ్బారావు, బత్తుల అనిల్, చీమకుర్తి బాలకృష్ణ, గుంటూరు ప్రభాకర్, కంప అరుణ్, కర్ణ లక్ష్మణరావు, మాజీ ఉపసర్పంచ్ దంతం వెంకట సుబ్బారావు, బీరక కేదారేశ్వర రావు మరియు పలువురు చేనేత నాయకులు పాల్గొన్నారు.











