కులగణనలో కోడ్ లేకపోతే లెక్కే తప్పు!
ప్రతి కులానికి యూనిక్ కోడ్ ఇవ్వాలి
కులగణనకు శాస్త్రీయ విధానం అవసరం
బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం చైర్మన్ చిరంజీవులు
ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ కేటాయించినప్పుడే కులగణనకు శాస్త్రీయత, పారదర్శకత వస్తుందని బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం చైర్మన్ టి. చిరంజీవులు అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కాలమ్‌లు ఉన్నట్టే ఓబీసీలు, జనరల్ వర్గాలకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని సూచించారు. డ్రాప్‌డౌన్ విధానంలో ప్రతి కులానికి ప్రత్యేక కోడ్ ఇచ్చి జనాభాను నమోదు చేయాలని కోరారు. ఒకే కులానికి వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు పేర్లు ఉండటం వల్ల గణాంకాల్లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందన్నారు. కచ్చితమైన లెక్కలు లేకుండా రూపొందించే విధానాలు భవిష్యత్‌లో సామాజిక న్యాయానికి నష్టం కలిగిస్తాయని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాధనంతో చేపడుతున్న జనగణన ప్రక్రియలో తప్పులకు తావులేకుండా ముందుగానే శాస్త్రీయ విధానాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. లేదంటే దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని స్పష్టం చేశారు.
ఢిల్లీలో బీసీల కోసం జాతీయ సదస్సు
ఢిల్లీ, తెలంగాణ భవన్లో “జనగణనలో కులగణన–ప్రతి కులానికి యూనిక్ కోడ్” అనే ప్రధాన డిమాండ్‌తో జాతీయ సదస్సు నిర్వహించారు. బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం చైర్మన్, మాజీ ఐఏఎస్ టి. చిరంజీవులు సదస్సుకు అధ్యక్షత వహించారు. ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున గౌడ కిరణ్ కుమార్ సమన్వయం చేశారు. మాజీ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఓబీసీ విభాగం చైర్మన్ అనిల్ జైహింద్, రాజ్యసభ సభ్యుడు విల్సన్, డా. సూరజ్ మండల్, ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్, ప్రొఫెసర్ రతన్‌లాల్, బాల్‌రాజ్ గౌడ్, సుగురు దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. కులాల వారీగా ఖచ్చితమైన జనాభా వివరాలు అందుబాటులోకి రావాలంటే ప్రస్తుత విధానంలో మార్పులు అవసరమని వక్తలు స్పష్టం చేశారు.

కులగణన లేకుండా రిజర్వేషన్లు ఎలా?
తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల ప్రయత్నాలు జరిగినా కోర్టుల్లో న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. బీసీ జనాభా అధికారికంగా ఎంతుందో తేల్చకుండా రిజర్వేషన్ల శాతం ఎలా నిర్ణయిస్తారని న్యాయస్థానాలు ప్రశ్నిస్తున్నాయని చెప్పారు. అందుకే కేంద్రం వెంటనే రాజ్యాంగ సవరణ చేసి, జనగణనలో బీసీల కులాల వారీ లెక్కలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి కులానికి ప్రత్యేక నంబరింగ్ ఇచ్చి ఖచ్చితమైన జనాభా నమోదు చేయాలని కోరారు. చట్టసభల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం కల్పించాలి. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో సముచిత రిజర్వేషన్లు ఇవ్వాలి అని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే బీసీలు ఉద్యమ బాట పడతారని హెచ్చరించారు
ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ కేటాయించాలి
కులగణనలో ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ కేటాయించాలని సదస్సులో పాల్గొన్న నాయకులు, మేధావులు డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కాలమ్‌లు ఉన్నట్టే ఓబీసీలకు ప్రత్యేక కాలమ్, జనరల్ వర్గాలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేసి, ప్రతి కులానికి ప్రత్యేక కోడ్ ఇవ్వాలని సూచించారు. డ్రాప్‌డౌన్ విధానంలో కులాల పేర్లను నమోదు చేస్తే ఒకే కులానికి వివిధ ప్రాంతాల్లో ఉన్న భిన్న పేర్ల కారణంగా తలెత్తే గందరగోళాన్ని నివారించవచ్చని తెలిపారు. డా. సూరజ్ మండల్, ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్, రాజ్యసభ సభ్యుడు విల్సన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయం వచ్చే వరకు కులగణన విధానాన్ని పునఃపరిశీలించాలని కోరారు. శాస్త్రీయ విధానం లేకుండా గణన చేపడితే కేంద్రం ఖర్చు చేస్తున్న సుమారు రూ.12,800 కోట్ల ప్రజాధనం వృథా అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

డిమాండ్ నెరవేరకపోతే ఉద్యమం
కులగణన కేవలం జనాభా లెక్కలు తేల్చే ప్రక్రియ కాదని, భవిష్యత్‌లో విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమ పథకాల రూపకల్పనకు కీలక ఆధారం అవుతుందని సదస్సులో వక్తలు పేర్కొన్నారు. అందుకే ప్రతి కులాన్ని ఖచ్చితంగా గుర్తించి నమోదు చేసే పారదర్శక వ్యవస్థను కేంద్రం వెంటనే రూపొందించాలని కోరారు. ఒకే కులానికి వేర్వేరు పేర్లు, వేర్వేరు గుర్తింపులతో లెక్కలు నమోదైతే వాస్తవ జనాభా గణాంకాలు తప్పే అవకాశం ఉందని తెలిపారు. యూనిక్ కోడ్ ఆధారంగా కులాల వారీగా ఖచ్చితమైన లెక్కలు తీసుకుంటేనే సామాజిక న్యాయానికి బలమైన పునాది ఏర్పడుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ డిమాండ్లను పట్టించుకోకుండా ప్రస్తుత విధానంలోనే జనగణన కొనసాగిస్తే దేశవ్యాప్తంగా విస్తృత ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని సదస్సు నాయకులు హెచ్చరించారు.











