ప్రజలకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యం.
కూకట్పల్లి నియోజకవర్గంలోని నల్లచెరువును బుధవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరిశీలించారు. చెరువు పరిసరాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను త్వరితగతిన కల్పించాలని హైడ్రా అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా ప్రజల కోసం టాయిలెట్లు, తాగునీటి సౌకర్యం, ఇండోర్ స్టేడియం, యోగా కేంద్రం నిర్మాణానికి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారులు స్పందించకపోతే తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల ద్వారా పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు.
హైడ్రా అధికారులకు అభినందనలు
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నల్లచెరువు అభివృద్ధి పనులు ప్రారంభించామని, అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా ఆ పనులను కొనసాగించడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. హైడ్రా కమిషనర్‌తో పాటు సంబంధిత అధికారులను ఆయన అభినందించారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న టాయిలెట్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని, దీనిపై హైడ్రా అధికారులు కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. అలాగే నల్లచెరువు నిర్వహణ బాధ్యతలను జీహెచ్‌ఎంసీకి బదిలీ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, మాధవరం రంగారావు, జనరల్ సెక్రటరీ ప్రభాకర్, సీనియర్ నాయకుడు తులసీరావు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, హైడ్రా అధికారులు పాల్గొన్నారు.











