ఢిల్లీలో విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలి.
హైదరాబాద్‌లో విగ్రహావిష్కరణలో సీఎం.
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు భారత రత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆయన సేవలకు గుర్తుగా ఢిల్లీలో విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలి విప్రో సర్కిల్‌లో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. దేశ ఆర్థిక వ్యవస్థను మౌనంగా ముందుకు నడిపించిన గొప్ప నాయకుడిగా ఆయనను కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. పార్లమెంటులో ప్రస్తావించాలని పార్టీ ఎంపీలకు సూచించారు.
ఆర్థిక సంస్కరణల శిల్పి
మన్మోహన్ సింగ్ భారత్ గర్వించదగ్గ జాతిరత్నం అని రేవంత్ రెడ్డి అన్నారు. రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా, ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా ఆయన చేపట్టిన ప్రతి పదవికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారని పేర్కొన్నారు. 1991లో పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి కీలక సంస్కరణలకు దిశానిర్దేశం చేశారు. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థలో మార్పులకు బాటలు వేశారని తెలిపారు.
తెలంగాణ కల సాకారం.. హక్కుల చట్టాలు
తెలంగాణ ఏర్పాటు చరిత్రలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ పాత్ర కీలకం అని సీఎం గుర్తు చేశారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసిన ఘనత నెహ్రూ, పటేల్‌కు దక్కితే, దశాబ్దాల తెలంగాణ ఆకాంక్షను సాకారం చేసిన ఘనత సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్‌కు దక్కుతుందని అన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ఆయన సంతకాన్ని విగ్రహ ప్రాంగణంలో పదిలపరిచామని తెలిపారు. విద్యా హక్కు, జాతీయ ఉపాధి హామీ, భూసేకరణ–పునరావాస చట్టాలు వంటి చర్యలు ఆయన పాలనలో చోటుచేసుకున్నాయని గుర్తు చేశారు. మన్మోహన్ సింగ్ జ్ఞాపకం దేశ రాజధానిలో శాశ్వతంగా నిలిచేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు.











