Home Telangana 22ఏపై పొంగులేటి సారీ భూముల సమస్యకు పరిష్కారం

22ఏపై పొంగులేటి సారీ భూముల సమస్యకు పరిష్కారం


మీరేం చేశారో మరచిపోయారా?
హరీశ్‌రావు‌కు మంత్రి సెటైర్లు.

22ఏ నిషేధిత భూముల వ్యవహారంపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. నిజమైన ప్రైవేటు భూమి 22ఏ జాబితాలో ఉంటే.. ఒక చిన్న దరఖాస్తు ఇస్తే చాలు, న్యాయబద్ధంగా ఉంటే క్లియర్‌ చేయించే బాధ్యత ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానాల వల్ల సామాన్యులకు ఇబ్బందులు తలెత్తిన మాట వాస్తవమేనని, దీనిపై ప్రజలను ఇబ్బంది పెట్టినందుకు ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెబుతున్నామని పేర్కొన్నారు. 22ఏ సమస్యల పరిష్కారానికి ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇప్పటికే 757 మంది ఫిర్యాదులు అందినట్లు వెల్లడించారు. ఈ నెలాఖరులోగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నిజమైన భూ హక్కుదారులకు న్యాయం చేయడంతో పాటు ప్రభుత్వ భూములను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

రికార్డులు పరిశీలించి.. రిజిస్ట్రేషన్‌కు అవకాశం

22ఏలో భూమి ఉందన్న కారణంతో దరఖాస్తుదారులను తిరస్కరించవద్దని పొంగులేటి అధికారులకు సూచించారు. భూమి నిషేధిత జాబితాలోకి ఎలా వచ్చిందో, సంబంధిత రికార్డులు ఏం చెబుతున్నాయో, వాస్తవ పరిస్థితి ఏమిటో పూర్తిగా పరిశీలించాలని ఆదేశించారు. జెన్యూన్‌ కేసులను వెంటనే పరిష్కరించి రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించాలని స్పష్టం చేశారు. అవసరమైతే స్లాట్‌ బుకింగ్‌లు పెంచడం, కార్యాలయాల పని వేళలు పెంచడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. రిజిస్ట్రేషన్‌ సాధ్యం కాని సందర్భాల్లో అందుకు కారణాన్ని ప్రజలకు స్పష్టంగా చెప్పాలని, ఫీజు చెల్లించిన వారికి నిబంధనల ప్రకారం తిరిగి చెల్లించాలని ఆదేశించారు. భూదాన్‌, దేవాదాయ, అటవీ భూముల పక్కన ఉండటం, ఒకే సర్వే నంబర్‌ కారణంగా కొన్ని ప్రైవేటు భూములు 22ఏలో చేరినట్లు గుర్తించామని, వాటిని పరిశీలించి క్లియర్‌ చేస్తామని చెప్పారు. సమస్యల కోసం 18005994788 టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

హరీశ్‌రావుపై పొంగులేటి ఘాటు సెటైర్లు

22ఏ సమస్యపై మంత్రి చేసిన ప్రకటనకు బీఆర్ఎస్‌ నేత హరీశ్‌రావు విమర్శలు చేయగా పొంగులేటి ఘాటుగా స్పందించారు. “ప్రభుత్వ విధానాల వల్ల సమస్యలు వస్తే సమాధానం చెప్పకుండా బుకాయించడం మీకు తెలిసినట్లు మాకు తెలియదు” అంటూ సెటైర్‌ వేశారు. గత బీఆర్ఎస్‌ పాలనలో ప్రభుత్వ భూముల పరిరక్షణను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. అప్పటి పాలనలో పేపర్‌ లీకులు జరిగినా, నిరుద్యోగులు తీవ్ర ఆందోళనకు గురైనా బాధ్యత తీసుకోలేదని విమర్శించారు. “మాది ప్రజా ప్రభుత్వం.. మీది దొరల ప్రభుత్వం” అంటూ హరీశ్‌రావును టార్గెట్‌ చేశారు. ప్రజల సమస్యను విని, పరిష్కార చర్యలను వివరించి, తప్పిదం జరిగితే క్షమాపణ చెప్పే ధైర్యం తమ ప్రభుత్వానికి ఉందన్నారు. చివరగా “ప్రభుత్వ భూములకు రక్షణ.. నిజమైన హక్కుదారులకు న్యాయం” అనే రెండు లక్ష్యాలతో 22ఏ సమస్యను పరిష్కరిస్తామని పొంగులేటి స్పష్టం చేశారు.

 

#PonguletiSrinivasReddy #22ALands #22A #TelanganaLandIssues #LandRegistration #TelanganaGovernment #HarishRao #TelanganaPolitics #LandRecords #ProhibitedProperties #PrivateLand #LandGrievances #TelanganaNews #Ponguleti #BRS