ఇందిరమ్మ రాజ్యాం..ఇంటింటా సంక్షోభం

38
  • ప్రజలను విస్మరించి పార్టీ పెద్దల కోసం పాలన
  • చిట్టినాయుడిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు
  • ఇబ్బంది పెట్టిన ప్రతీ ఒక్కరికీ సమాధానం ఇస్తాం
  • వర్దన్నపేట కార్యకర్తల భేటీలో కేటీఆర్ హెచ్చరిక

కాంగ్రెస్ పార్టీ చెప్పిన పచ్చి అబద్ధాలను నమ్మి ఓట్లేసిన ప్రజలకు ఇప్పుడు తీవ్ర నిరాశే మిగిలిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పరకాలలో నిర్వహించిన పార్టీ శిక్షణా తరగతుల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత బీఆర్ఎస్ పాలనలో పేద ప్రజలను కంటికి రెప్పలా ఆదుకుంటే, ప్రస్తుత కాంగ్రెస్ నేతలు కేవలం తమ పార్టీ పెద్దల ప్రయోజనాల కోసమే చూసుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం అంటే ఇంటింటా సంక్షోభంలా మారిందని ఎద్దేవా చేశారు.

రైతులకు తీరని అన్యాయం చేసిన సీఎం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ముప్పై నెలల్లోనే తీవ్ర వినాశనం జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. మూడు నెలల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని బాండ్ పేపర్లు ఇచ్చి మోసం చేశారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే బూతుల బురద తప్ప రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదన్నారు. రైతులు పండించిన పంటల కొనుగోలు విషయంలో ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని, రైతుబంధు పథకాన్ని ఎగ్గొట్టి, యూరియా కోసం రైతులను మళ్లీ క్యూ లైన్లలో నిలబెట్టే దుస్థితికి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఢిల్లీ చేతుల్లో తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికి వంద సార్లు ఢిల్లీకి వెళ్లినా రాష్ట్రానికి ఒక్క పైసా కూడా తీసుకురాలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇక్కడి ప్రజల సొమ్మును, డబ్బుల సంచులను మాత్రం ఢిల్లీకి మూటలు కట్టి పంపిస్తున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీ చేతుల్లో పాలన పెడితే రాష్ట్రానికి పెద్ద నష్టం జరుగుతుందని తాము మొదటి నుంచీ చెబుతున్న మాట నిజమైందన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, చీకటిని చూస్తేనే ప్రజలకు కేసీఆర్ పాలన అనే వెలుగు విలువ తెలుస్తుందని వ్యాఖ్యానించారు.

చిట్టినాయుడిని అస్సలు వదిలిపెట్టే ప్రసక్తి లేదు
వర్ధన్నపేట నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. వచ్చే ఐదేళ్లలో తమ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరికీ తగిన సమాధానం చెబుతామన్నారు. తాను కేసీఆర్ అంత మంచోడిని కాదని, సీఎం చిట్టినాయుడికి, ఆయన బృందానికి సినిమా చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టిన వారు సప్తసముద్రాల అవతల దాక్కున్నా వెతికి పట్టుకొచ్చి శిక్షిస్తామని, ఎవరినీ వదిలిపెట్టే సమస్యే లేదని స్పష్టం చేశారు.

 

#KTR #BRS #BharatRashtraSamithi #Parakala #Vardhannapet #TelanganaPolitics #RevanthReddy #CongressGovernment #KCR #BRSWorkers #PoliticalTraining #FarmerIssues #RythuBandhu #TelanganaFarmers #CongressVsBRS #PoliticalWar #TelanganaNews #KTRSpeech #ParakalaMeeting #VardhannapetMeeting #StatePolitics #BRSCadre #TelanganaDevelopment #PoliticalCriticism #LatestPolitics