కాంగ్రెస్ అరాచక పాలన – ఎస్.బి.ఐని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు

46

రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్

హైదరాబాద్ నగరంలో గత ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఎకరం భూమిని కేటాయించిందని, అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ భూమిని అమ్మేయడమే కాకుండా ప్రశ్నించినందుకు ఎస్‌బీఐపైనే పగబట్టారని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 20 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్న భూమిని రేవంత్ రెడ్డి ఎలా అమ్ముతారని ఎస్‌బీఐ హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటే, ఆ బ్యాంకునే నిషేధిస్తామని రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేయడం సిగ్గుచేటన్నారు.

రేవంత్ రెడ్డి మోసగాడంటూ తీవ్ర ఆరోపణలు
రేవంత్ రెడ్డి ఎవరైనా ప్రశ్నిస్తే పగబడుతూ అక్రమంగా కేసులు పెడుతున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ఇవాళ ఎస్‌బీఐని నిషేధిస్తా అంటున్న ముఖ్యమంత్రి రేపు రిజర్వ్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ కూడా తన మాట వినకపోతే వాటిని కూడా నిషేధిస్తానని అంటారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించడానికి బ్యాంక్ కావాలి కాబట్టి రేవంత్ రెడ్డి కొత్తగా కొండల్ రెడ్డి బ్యాంక్ అని పెడతారేమోనని విమర్శించారు. రేవంత్ రెడ్డి మొనగాడు కాదు, ఒక మోసగాడని నల్లమల పేరు చెప్పి ఆ ప్రాంత గౌరవాన్ని తగ్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతు బకాయిలు పెండింగ్ పెట్టి జల్సాలు చేస్తున్నారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు రైతు భరోసా కింద 29,350 రూపాయల బకాయిలను చెల్లించలేదని, ఈ ప్రభుత్వంలో బోనస్ కాస్తా బోగస్ అయిందని హరీశ్ రావు దుయ్యబట్టారు. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో వందల కోట్లు ఖర్చు చేసి ప్రకటనలు ఇవ్వడానికి, నూట ఒక కోట్లతో గెస్ట్ హౌస్ నిర్మించుకోవడానికి డబ్బులు ఉంటాయి కానీ పేదలకు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద పైసలు లేవని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంతో ఒక తరం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.

భూమి బద్దలైనా వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే
రాష్ట్రంలో ఔరంగజేబు జుట్టుపై పన్ను వేసినట్లుగా రేవంత్ రెడ్డి ప్రజలపై పెట్రోల్, డీజిల్, ఎరువులు, ఆర్టీఏ ఛార్జీలను పెంచి పన్నుల భారం మోపుతున్నారని హరీశ్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఐదేళ్ల పాలనను ప్రజలు యాభై ఏళ్ల వరకు తిట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా నిర్మించలేదన్నారు. భూమి బద్దలైనా రాష్ట్రంలో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, ప్రజలు స్కాంల ప్రభుత్వం కాకుండా స్కీమ్‌ల ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.

 

#HarishRao #BRS #KTR #KCR #RevanthReddy #TelanganaPolitics #SBI #StateBankOfIndia #Achampet #BRSMeeting #CongressGovernment #FarmerIssues #RythuBharosa #FeeReimbursement #TelanganaFarmers #PoliticalCriticism #BRSVsCongress #TelanganaNews #HarishRaoSpeech #Nallamala #PetrolPriceHike #DieselPriceHike #PoliticalWar #KCRGovernment #LatestPolitics