కంచి కేఫ్‌లో ఫంగస్ కాలీఫ్లవర్… కోడికూర చిట్టిగారె లొట్టలేసుకుంటున్నారా?

41
  • ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో విస్తుపోయే నిజాలు
  • హైదరాబాద్‌ హోటళ్లలో ఫుడ్‌ సేఫ్టీ దాడులు
  • ప్రజల ప్రాణాలతో హోటళ్ల చెలగాటం
  • ప్రముఖ రెస్టారెంట్లలో ఆగని అక్రమాలు

హైదరాబాద్ నగర పరిధిలోని పలు ప్రముఖ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు తనిఖీలు నిర్వహించారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న రెండు పెద్ద హోటళ్లలో తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనలను గుర్తించి యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. వరుసగా తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ కొన్ని హోటళ్ల నిర్వాహకులలో ఎలాంటి మార్పు రావడం లేదని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రీజర్లలో కాలం చెల్లిన ఆహార పదార్థాలను నిల్వ ఉంచి కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది.

కంచి కేఫ్‌లో ఫంగస్ కాలీఫ్లవర్
పుప్పాలగూడలోని కంచి కేఫ్‌లో నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. వంటగది, స్టోర్ రూమ్ మధ్య ఓపెన్ డస్ట్‌బిన్లు ఉండటంతో ఆ ప్రాంతమంతా ఈగలు ముసురుతూ తీవ్ర దుర్వాసన వస్తోంది. స్టోర్ రూమ్ సీలింగ్‌పై విపరీతంగా దుమ్ము పేరుకుపోయింది. కూరగాయలు కట్ చేసే ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండి అపరిశుభ్రంగా మారింది. వంటకు ఉపయోగించే కాలీప్లవర్‌పై ఫంగస్ పెరిగినట్లు అధికారులు గుర్తించారు. వంటగదిలో బొద్దింకలు తిరుగుతుండటం, ఫ్రిజ్‌లలో నిల్వ చేసిన పిండిపై ఎలాంటి లేబులింగ్ లేకపోవడంపై అధికారులు మండిపడ్డారు. మెడికల్ ఫిట్‌నెస్, పెస్ట్ కంట్రోల్ రికార్డులు లేకపోవడంతో వీరికి నోటీసులు ఇచ్చారు.

కోడికూర చిట్టిగారేలో జిడ్డు వంటగది
నల్లగండ్లలోని కోడికూర చిట్టిగారే రెస్టారెంట్‌లోనూ అధికారులు విస్తృతంగా సోదాలు చేశారు. ఇక్కడ ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన చికెన్, డెజర్ట్స్‌పై ఎలాంటి లేబుల్స్ లేవని అధికారులు కనుగొన్నారు. దీంతో ఆ నిల్వ ఆహార పదార్థాలను అక్కడికక్కడే పారవేయించారు. కిచెన్ సీలింగ్ అంతా పూర్తిగా జిడ్డుగా మారినట్లు గుర్తించి వెంటనే శుభ్రం చేయాలని ఆదేశించారు. ఈ రెస్టారెంట్‌లోనూ ఉద్యోగుల మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, ప్యాకేజింగ్ మెటీరియల్ టెస్టింగ్ రికార్డులు అందుబాటులో లేవు.

కఠిన చర్యలకు అధికారుల హెచ్చరిక
పరిశుభ్రత లోపించిన రెండు రెస్టారెంట్ల యాజమాన్యాలకు ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఫుడ్ లేబులింగ్, హౌస్‌కీపింగ్ పద్ధతులను వెంటనే మెరుగుపరచుకోవాలని గడువు విధించారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి అపరిశుభ్ర వాతావరణంలో వంటలు చేస్తే హోటల్ లైసెన్సులను రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు. రాబోయే రోజుల్లో నగరవ్యాప్తంగా తనిఖీలను మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు.

 

#FoodSafety #HyderabadRestaurants #FoodSafetyRaid #KanchiCafe #KodikuraChittigare #FoodInspection #FoodSafetyDepartment #RestaurantViolations #ExpiredFood #PublicHealth #HyderabadNews #FoodHygiene #HealthAlert #RestaurantRaid #BreakingNews