- రుజువులివిగో.. డీఎస్సీలో అక్రమాలివిగో..!
- కూటమి సర్కారుపై వైసీపీ చీఫ్ ఆరోపణలు
- కుంభకోణంపై సీబీఐ దర్యాప్తుకు జగన్ డిమాండ్
- డీఎస్సీ పరీక్షల నిర్వహణలో భారీగా అక్రమాలు
- నిరుద్యోగుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం ఆటలు
- ఒకే అధికారి చేతిలో విద్యాశాఖ బాధ్యతలతో కుట్ర
- ఆన్‌లైన్ విధానం పేరుతో మెరిట్ జాబితా కేంద్రీకరణ
- అర్హత లేకుండానే స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల పంపిణీ
- తప్పులు ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్న బాబు సర్కార్
- అణచివేసే కొద్దీ ఆంధ్రాలోనూ కాక్రోచ్‌లు బయకొస్తాయ్!
- విద్యాశాఖ మంత్రిగా లోకేశ్ సమాధానాలు చెప్పాలి!
- బాధితులకు న్యాయం కోసం నేడు వైసీపీ నిరసన ర్యాలీలు
డీఎస్సీ పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ, ఉద్యోగాలను అమ్ముకున్న ఈ పెద్ద కుంభకోణంపై తక్షణమే సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఆయన అల్టిమేటం జారీ చేశారు. తప్పు చేసిన వారే విచారణ స్థానంలో కూర్చుంటే బాధితులకు ఎప్పటికీ న్యాయం జరగదని హెచ్చరించారు. జూన్ 12న నిర్వహించబోయే ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన ర్యాలీల ద్వారా ప్రభుత్వ అవినీతిని, ఎన్నికల హామీల వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతామని, యువత ఆగ్రహానికి గురికాక ముందే స్పందించాలని జగన్ సర్కారును గట్టిగా హెచ్చరించారు.
ఏపీలో డీఎస్సీ పరీక్షల కుంభకోణం
ఇటీవల నిర్వహించిన జిల్లా ఎంపిక కమిటీ..డీఎస్సీ పరీక్షలు, నియామకాల ప్రక్రియలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకున్న ఈ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ, సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. జూన్ 12వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించతలపెట్టిన ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన ర్యాలీలలో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రశ్నపత్రాల రూపకల్పన నుండి అభ్యర్థుల ఎంపిక వరకు ప్రతి దశలోనూ అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆయన ఒక ప్రకటనలో వివరంగా పేర్కొన్నారు.
నిబంధనల ఉల్లంఘనతో పారదర్శకతకు పాతర
దాదాపు 16 వేల ఉపాధ్యాయ పోస్టుల కోసం లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు పగలు రాత్రి కష్టపడి చదివారని జగన్ మోహన్ రెడ్డి గుర్తుచేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఈ నియామక ప్రక్రియను పూర్తిగా అపహాస్యం చేసిందని మండిపడ్డారు. కొన్ని ఉద్యోగాలు అమ్ముడుపోయినట్లు స్పష్టమైన ఆధారాలు, వీడియోలు కూడా బయటకు వచ్చాయని చెప్పారు. సాధారణంగా డీఎస్సీ కన్వీనర్ పర్యవేక్షణలో జరగాల్సిన ఈ ప్రక్రియను పక్కనపెట్టి, ప్రశ్నపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) డైరెక్టర్‌కు అప్పగించారని ధ్వజమెత్తారు. కీలకమైన బాధ్యతలను ఒకే ఒక్క వ్యక్తి చేతిలో పెట్టడం వల్లే పారదర్శకత పూర్తిగా లోపించిందని ఆరోపించారు.
నియామకాల్లో డేటా తొలగింపు అనుమానాలు
ఈ వ్యవహారంలో ఒక ఉద్యోగికి సంబంధించిన వివాదం బయటకు రాగానే అతని డేటాను వ్యవస్థ నుండి తొలగించారని జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఆ ఉద్యోగికి ఉద్యోగం రాలేదని, దీనిపై అతను న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ప్రభుత్వం నుండి పొంతన లేని సమాధానాలు వచ్చాయని పేర్కొన్నారు. అసలు ప్రశ్నపత్రాల లీకేజీ ఎక్కడ మొదలైంది, ఎంతమందికి ఆ పేపర్ ముందే చేరింది, ఎంత సొమ్ము చేతులు మారింది వంటి నిజాలు తేలాలంటే సీబీఐ వంటి మూడవ పక్ష సంస్థ విచారణ చేయడం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. సాధారణంగా జిల్లా స్థాయిలో ప్రదర్శించాల్సిన మెరిట్ జాబితాలను ఆన్‌లైన్ విధానం పేరుతో కేంద్రీకృతం చేసి అక్రమాలకు తెరలేపారని విమర్శించారు.
స్పోర్ట్స్ కోటా పేరిట అడ్డగోలు నిర్ణయాలు
ఈ కుంభకోణంలో మరో పెద్ద విచిత్రం ఏమిటంటే, స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు పొందే అభ్యర్థులు డీఎస్సీ అర్హత పరీక్ష రాయనవసరం లేదని, కేవలం ఆటల్లో పాల్గొన్న ధృవీకరణ పత్రం ఉంటే సరిపోతుందని ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిందని జగన్ తెలిపారు. తమకు అనుకూలమైన వారికి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికే ఈ నిబంధనలు తెచ్చారని మండిపడ్డారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇచ్చిన కాలేజీ, విశ్వవిద్యాలయ స్థాయిలోని సర్టిఫికేట్ల ఆధారంగా సుమారు 270 మంది అర్హత పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు సాధించారని చెప్పారు. మరోవైపు జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించిన అసలైన క్రీడాకారులను ఇంటర్వ్యూలకు పిలిచి, వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
పాత నిబంధనల పునరుద్ధరణతో అసలు రంగు
తమకు కావలసిన వారికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాల పంపిణీ పూర్తి కాగానే, పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారిన తర్వాత ప్రభుత్వం వెంటనే పాత ఉత్తర్వులను రద్దు చేసిందని జగన్ మోహన్ రెడ్డి ఎండగట్టారు. స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు కూడా మళ్లీ అర్హత పరీక్ష రాయాల్సిందేనంటూ కొత్త నిబంధన తెచ్చారని, ఇది ఈ కుంభకోణం తీవ్రతను స్పష్టం చేస్తోందని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పుడు పరీక్షలు నిర్వహించినా లీకులు, అవినీతి సర్వసాధారణంగా మారాయని దుయ్యబట్టారు. దీనికి భిన్నంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి తప్పులు లేకుండా కేవలం నాలుగు నెలల రికార్డు కాలంలోనే నోటిఫికేషన్ నుండి నియామక పత్రాల అందజేత వరకు 1.30 లక్షల సిబ్బందిని పారదర్శకంగా నియమించామని గుర్తుచేశారు.
ఏపీలో కూడా రోడ్డు మీదకు కాక్రోచ్‌లు వస్తాయ్!
ఈ తప్పులను ఎత్తిచూపుతుంటే చంద్రబాబుకు నరాలు తెగిపోయేంత బీపీ వస్తోందని, అందుకే ప్రశ్నించిన ప్రతిఒక్కరిపైనా కేసులు పెట్టి, అరెస్టులు చేసి, భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఇది జెన్‌జీ కాలమని, ఇప్పుడు జెన్ ఆల్ఫా కూడా నడుస్తోందని, దేన్నీ ఆపలేరని చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. ఎంత ఆపాలని చూస్తే నిరసన అంతకంతకూ ఇంతింతై వటుడింతై పెరుగుతుందని, దగాపడ్డ యువత మిమ్మల్ని విడిచిపెట్టకుండా తప్పకుండా తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఏపీలో కూడా కాక్రోచ్‌లు బయటకు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే తాము సీబీఐ దర్యాప్తునకు పట్టుబడుతున్నామని, లోతుగా వెళ్తే మరిన్ని విషయాలు తప్పకుండా బయటకు వస్తాయని స్పష్టం చేశారు. అయితే విద్యాశాఖ మంత్రిగా సాక్షాత్తూ చంద్రబాబు కొడుకు లోకేశ్ ఉన్నాడు కాబట్టి ఈ తప్పులపై విచారణ చేయడానికి చంద్రబాబు ముందుకు రాడని, సరికదా ఎదురుదాడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
సీబీఐ విచారణ జరిగితేనే న్యాయం జరిగేది!
ఈ పరీక్షల అక్రమాల కేసులో ముఖ్యమంత్రితో పాటు విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆయన కుమారుడు లోకేశ్ కూడా నిందితులుగా ఉన్నారని జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. తప్పు చేసిన వారే న్యాయ నిర్ణేతలుగా కూర్చుంటే బాధితులకు న్యాయం జరగదని స్పష్టం చేశారు. అర్హత పరీక్ష లేకుండానే స్పోర్ట్స్ కోటా పేరుతో అస్మదీయులకు ఉద్యోగాలు కట్టబెట్టడం, మెరిట్ జాబితా కేంద్రీకరణ, లీకేజీ ఆరోపణలు నిరుద్యోగుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టాయన్నారు. కుంభకోణంలో ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి పాత్రలపై నిజాలు నిగ్గుతేలాలంటే సీబీఐ విచారణ ఒక్కటే మార్గమని వైఎస్సార్సీపీ స్పష్టం చేసింది. యువత ఆవేదన, ఆగ్రహం కలిసి ప్రభుత్వ పతనానికి దారితీస్తాయని, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తేల్చిచెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఈ వైఫల్యాలను జూన్ 12న జరిగే నిరసన ర్యాలీలలో ఎండగడతామని చెప్పారు. డీఎస్సీ అన్యాయాన్ని యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, వారి పోరాటంలో తాము కూడా భాగస్వామ్యం వహిస్తామని వైఎస్సార్సీపీ స్పష్టం చేసింది.












