పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మార్కెట్‌లో పొగాకు రకం ఏదైనా సరే కిలో ధర రూ.200 కంటే తగ్గడానికి వీల్లేదని ఆయన తేల్చి చెప్పారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో పొగాకు రైతులు, ట్రేడర్లతో ముఖ్యమంత్రి ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొగాకు ధరలపై సుదీర్ఘంగా సమీక్షించి ఇటు రైతులు, అటు ట్రేడర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో పొగాకు పండించిన రైతులను ఆదుకునేందుకు కొనుగోలు కంపెనీలు మానవీయ కోణంలో ఆలోచించి నూటికి నూరు శాతం సహకరించాలని సీఎం ఆదేశించారు.
నో బిడ్ విధానానికి తావులేదు
పొగాకు వేలం కేంద్రాల్లో నో బిడ్, లో బిడ్ అనే మాటలకు అస్సలు తావుండకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైతులు ఎంతో కష్టపడి మార్కెట్టుకు తెచ్చిన పొగాకు బేళ్లను ధరలు లేవనే నెపంతో వెనక్కి పంపే పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదని చెప్పారు. మార్కెట్లోకి వచ్చిన ప్రతి పొగాకు బేలును కంపెనీలు కచ్చితంగా కొనుగోలు చేయాల్సిందేనని ఆయన ఆదేశించారు. దీనికి అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని పొగాకు వేలం ప్లాట్‌ఫారమ్‌లను పూర్తి స్థాయిలో పునఃప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అలాగే పొగాకు కొనుగోలు కంపెనీలన్నీ తప్పనిసరిగా వేలంలో పాల్గొనాలని, ఏ ఒక్క కంపెనీ కూడా కొనుగోళ్లు జరపకుండా వెనక్కు వెళ్లడానికి వీల్లేదని హెచ్చరించారు.
అనధికార కొనుగోళ్లపై కఠిన చర్యలు
టొబాకో బోర్డ్ పరిధిలో కాకుండా బయట అనధికారికంగా పొగాకు కొనుగోళ్లు జరిపిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే అవసరమైతే అరెస్టులు కూడా చేస్తామని స్పష్టం చేశారు. తనకు ఎప్పుడూ రైతుల ప్రయోజనాలే ముఖ్యమని, ఈ ఏడాది పొగాకు ట్రేడర్లు, కంపెనీలు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. రాబోయే ఏడాది నుంచి అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తామని, లాభసాటిగా ఉండే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి వివరించారు.
కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేక సంప్రదింపులు
పొగాకు మార్కెట్ స్థిరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా గట్టి ప్రయత్నాలు చేస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వంతో నేరుగా సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. రైతులు, టొబాకో బోర్టు ప్రతినిధులను వెంట పెట్టుకుని ఢిల్లీ వెళ్లి సంబంధిత కేంద్ర మంత్రులు, అధికారులను కలవాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడును ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, ఆనం రాంనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవి కుమార్, ప్రజా ప్రతినిధులు, టొబాకో బోర్డ్ ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











