తెలంగాణ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మొన్నటి వ్యవసాయ సమీక్షలో పంట బోనస్‌కు కోతలు పెట్టిన ప్రభుత్వం, నేడు డిజిటల్ క్యాబినెట్ పేరుతో ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేయడం రైతాంగాన్ని దారుణంగా మోసం చేయడమేనని మండిపడ్డారు. రోజుకో వింత నిర్ణయం, చెత్త విధానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బతుకును చిత్తు చేస్తోందని ఆరోపించారు. వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతూ తన ‘డిస్ట్రక్టివ్ క్రియేటివిటీ’ తో రైతుల జీవితాలతో ఈ ప్రభుత్వం ఆడుకుంటోందని హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు.
కొనుగోళ్ల బాధ్యత నుండి పలాయనం
ఇకపై పాత విధానంలో కాకుండా కేంద్రం నిర్దేశించిన కోటాకు లోబడి మాత్రమే ధాన్యం కొనుగోళ్లు చేస్తామని చెప్పడం అంటే ధాన్యం కొనుగోళ్ల నుండి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకోవడమేనని హరీశ్ రావు స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పంటలు కొనుగోలు చేయడానికి చేతకాదా అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఎందుకు కేంద్రాన్ని సాకుగా చూపి రైతుల గొంతు కోస్తున్నాడని నిలదీశారు. పంటలు కొనుగోలు చేయలేమనే తమ చేతగాని తనాన్ని రాష్ట్ర క్యాబినెట్ మీడియా సాక్షిగా ఒప్పుకుందని ఎద్దేవా చేశారు. రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనకపోతే వారు ఆ పంటను ఏం చేయాలని ప్రశ్నించారు.
సాగుపై ఆంక్షలు, పంటల కోతలు
పంట బోనస్ రావాలంటే ఏడు రకాల సన్నాలే సాగు చేయాలని చెప్పడం అంటే సాగుపై ఆంక్షలు విధించడమేనని హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వం చెప్పిన మాటలు నమ్మి పంట మార్పిడి కింద జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, శనగలు పండించిన రైతుల పరిస్థితి ఇప్పుడు రోడ్డు పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం పావు వంతు మాత్రమే పొద్దుతిరుగుడు కొనుగోలు చేస్తే, మిగతా 1.20 లక్షల క్వింటాళ్ల పంట మిగిలిపోయిందన్నారు. శనగలకు మద్దతు ధర రూ. 5,875 ఉంటే ప్రభుత్వం కొనకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు మూడు, నాలుగు వేలకే రైతులు అమ్ముకునే దుస్థితి వచ్చిందని, జొన్నలు, మొక్కజొన్న రైతులు కూడా దిక్కుతోచని స్థితికి వెళ్లారని వివరించారు. కేసీఆర్ రైతన్నను రాజుగా చేస్తే, రేవంత్ రెడ్డి దివాళా తీసే కుట్రలు చేస్తున్నాడన్నారు.
నీటి నిర్వహణలో ఘోర వైఫల్యం
ప్రాజెక్టుల్లో తెలంగాణకు రావాల్సిన నీటిని ఆంధ్రప్రదేశ్‌కు వదిలేసి, ఇప్పుడు రైతులకు నీళ్లు లేవు కాబట్టి పంటలు చూసుకుని వేయండి అని చెప్పడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని హరీశ్ రావు దుయ్యబట్టారు. ఎల్‌నినో ప్రభావంపై నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కృష్ణా జలాలపై త్రిసభ్య కమిటీ సమావేశానికి ముందే ఏపీ ఇప్పటికే అధికంగా నీటిని తరలించిందని లేఖలు రాసినా, మళ్లీ 10 టీఎంసీల నీటిని ఏపీకి ఎందుకు వదిలారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తూ ఎల్ నినో పేరుతో తప్పించుకునే ప్లాన్ వేయడం సిగ్గుచేటన్నారు.
బకాయిలతో సహా నిధులు ఇవ్వాలి
రైతుభరోసా నిధులు విడుదల చేయడానికి బహిరంగ సభలు ఎందుకు నిర్వహిస్తున్నారని హరీశ్ రావు ఆక్షేపించారు. గత యాసంగిలో రెండు సభలు పెట్టి కొద్దిమందికే నిధులు వేసి చేతులు దులుపుకున్నారని, ఇప్పుడు మరోసారి బహిరంగ సభ పెట్టి రైతుభరోసా వేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించిన నిధులతో పాటు, గతంలో పెండింగ్‌లో ఉంచిన మూడు విడతల రైతు భరోసా బకాయిలు మొత్తం రూ. 16,545 కోట్లను ఈ నెల 30న మధిర వేదికగా రైతుల ఖాతాల్లో ఒకేసారి జమ చేయాలని డిమాండ్ చేశారు. సాకులు చెప్తూ పంట కొనుగోళ్ల బాధ్యత నుండి తప్పుకోవాలని చూస్తే తెలంగాణ రైతాంగం నుండి తీవ్ర ప్రతిఘటన తప్పదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీశ్ రావు హెచ్చరించారు.










