Home Political_News Leaders_politics బీజేపీ గుండాయిజం నశించాలి

బీజేపీ గుండాయిజం నశించాలి

Harish Rao, Ktr
  • కరీంనగర్ ఘటనపై కేటీఆర్ ఆగ్రహం
  • ప్రణాళికతోనే ఎటాక్ అన్న హరీశ్ రావు

కరీంనగర్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయం, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారుపై బీజేపీ శ్రేణులు జరిపిన దాడిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో ఖండించారు. పట్టపగలు గూండాల మాదిరిగా వచ్చి ప్రభుత్వ కార్యాలయాలను, వాహనాలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే కేంద్ర మంత్రి బండి సంజయ్ తన అనుచరులను ఇలాంటి పిరికిపంద చర్యలకు ఉసిగొల్పుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. దాడి జరిగిన వెంటనే కౌశిక్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన కేటీఆర్, పార్టీ కార్యకర్తల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం సిగ్గుచేటు
ఈ దాడుల సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. కళ్లముందే ఇంత అరాచకం జరుగుతున్నా పోలీసులు చోద్యం చూడటం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బి-టీమ్‌గా మారిన బండి సంజయ్, రాష్ట్రంలో శాంతి భద్రతలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉండి, సొంత నియోజకవర్గంలోనే అరాచకాలను ప్రోత్సహించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో కరీంనగర్ ప్రజలకు బండి సంజయ్ చేసిందేమీ లేదని, కేవలం విమర్శలతో కాలక్షేపం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

హరీష్ రావు ఘాటు విమర్శలు
మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు. బీజేపీ కార్యకర్తలు కర్రలు, రాడ్లతో దాడికి పాల్పడటం వారి సంస్కృతిని తెలియజేస్తోందని విమర్శించారు. కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ ముగిసిన పది నిమిషాలకే ప్రణాళికాబద్ధంగా ఈ దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కరీంనగర్ వంటి పట్టణంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమని, బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి బెదిరింపులకు లొంగదని ఆయన స్పష్టం చేశారు. మౌనంగా ఉన్న ప్రజలే వీరికి తగిన బుద్ధి చెబుతారని హరీష్ రావు హెచ్చరించారు.