Home Telangana ఢిల్లీకి చేరిన కొండా పంచాయితీ

ఢిల్లీకి చేరిన కొండా పంచాయితీ

హైకమాండ్ పిలుపుతో హస్తినకు సురేఖ.
కేసీ వేణుగోపాల్‌తో కీలక భేటీ.

తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి రాజకీయ ఉత్కంఠ పెరిగింది. మంత్రి కొండా సురేఖకు ఢిల్లీ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఆమె హస్తినకు వెళ్లారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఆమె భేటీ కానున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అపాయింట్‌మెంట్ కోసం కూడా సురేఖ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీంతో హైకమాండ్ పెద్దలు సురేఖతో ఏం చర్చించబోతున్నారు? ఆమెపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? అనే ప్రశ్నలు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

కుమార్తె వ్యాఖ్యలతో మొదలైన వివాదం

గత కొంతకాలంగా కొండా సురేఖ, ఆమె కుమార్తె కొండా సుస్మితకు సంబంధించిన వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. ఇటీవల గీసుకొండలో సీఎం రేవంత్‌రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై సుస్మిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తం కావడంతో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ స్పందించింది. సుస్మిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే తన కుమార్తె వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని, అవి వ్యక్తిగత వ్యాఖ్యలని సురేఖ వివరణ ఇచ్చారు. అనంతరం ఈ వ్యవహారంపై రూపొందించిన నివేదికను టీపీసీసీ హైకమాండ్‌కు పంపినట్లు సమాచారం. దీంతో ఢిల్లీ భేటీలో ఈ అంశంపై సురేఖ వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

మంత్రి పదవిపై ఊహాగానాలు

సురేఖ ఢిల్లీ పర్యటనతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి కూడా రెండు రోజుల పర్యటనకు హస్తిన చేరడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం వెళ్లిన కొద్దిసేపటికే సురేఖ ఢిల్లీ చేరుకోవడంతో కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలపై కీలక చర్చలు జరుగుతున్నాయనే ప్రచారం మొదలైంది. హైకమాండ్ కేవలం వివరణ తీసుకుని వ్యవహారాన్ని ముగిస్తుందా? లేక క్రమశిక్షణ పరంగా చర్యలు తీసుకుంటుందా? అనే చర్చ సాగుతోంది. కఠిన నిర్ణయం వస్తే మంత్రి పదవికి సురేఖ రాజీనామా చేసే అవకాశముందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు ఖాళీగా ఉన్న కేబినెట్ స్థానాల భర్తీ, కొత్త మంత్రుల ఎంపికపై కూడా ఢిల్లీలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఖర్గేతో భేటీ కావడం కూడా రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. మొత్తంగా ఢిల్లీ పర్యటనలు తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త సమీకరణాలకు సంకేతాలా? అన్న చర్చ ఇప్పుడు జోరందుకుంది.

 

#KondaSurekha #KondaSurekhaDelhiVisit #TelanganaCongress #KCVenugopal #CongressHighCommand #KondaSushmitha #RevanthReddy #MallikarjunKharge #TelanganaPolitics #CongressCrisis #CongressDiscipline #KondaControversy #TelanganaNews