వైద్యులపై దాడికి ఓన్లీ జైల్
ఆసుపత్రిలో దాడులపై సీరియస్ యాక్షన్
ఆసుపత్రుల్లో వైద్యులపై దాడి చేసే ఘటనలను తేలిగ్గా తీసుకోలేమని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలోని థానే జిల్లాలో మున్సిపల్ ఆసుపత్రి వైద్యులపై దాడి చేసిన కేసులో శివసేన కార్పొరేటర్ రమేష్ మ్హాత్రే బెయిల్ షరతులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఏజీ మసీహ్లతో కూడిన ధర్మాసనం “వైద్యులపై దాడి చేసేవారు బెయిల్‌కు అర్హులు కారు” అంటూ మౌఖికంగా వ్యాఖ్యానించింది. ఆసుపత్రిలోకి వెళ్లి ఎవరినైనా కొట్టడం సమర్థనీయం కాదని, వైద్య వర్గానికి గౌరవం లేకపోవడం తీవ్ర అంశమని కోర్టు పేర్కొంది. గుంపుగా దాడి జరిగితే వైద్యులపై పడే మానసిక ఒత్తిడిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.
బెయిల్‌పై హైకోర్టు కఠిన షరతులు
వైద్యుల ఆందోళనల తర్వాత బాంబే హైకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. తొలుత దిగువ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను నిలిపివేసిన హైకోర్టు.. ఆ నిర్ణయం తీవ్రంగా తప్పుదోవ పట్టించేలా ఉందని వ్యాఖ్యానించింది. అనంతరం ఆగస్టు 7న రమేష్ మాత్రేకు బెయిల్ మంజూరు చేస్తూ చార్జిషీట్ దాఖలయ్యే వరకు మహారాష్ట్రలో ఉండకూడదని, గోవాలోని కలంగుట్‌లో ఉండాలని, వారానికి మూడు సార్లు అంజునా పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని షరతులు విధించింది. ఎన్నికైన ప్రజాప్రతినిధి తన ఓటర్లపై దాడి చేస్తే అది ప్రజాస్వామ్య వ్యవస్థపైనే దాడి అవుతుందని హైకోర్టు అప్పట్లో వ్యాఖ్యానించింది. మరోవైపు మాత్రే తరఫు న్యాయవాది వైద్యులపై వ్యక్తిగత కక్ష లేదని వాదించారు. అయితే ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పటికే వైరల్ అయిందని కోర్టు గుర్తుచేసింది. రాష్ట్ర ప్రభుత్వం బెయిల్ రద్దు కోసం పిటిషన్ దాఖలు చేయనుండగా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా బెయిల్‌ను వ్యతిరేకించింది. ఈ పిటిషన్ కోసం వేచి చూస్తామని సుప్రీంకోర్టు తెలిపి తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
గొడవకు దారితీసిన అసలు ఘటన
ఈ కేసుకు సంబంధించిన ఘటన జూలై 6న థానేలోని శాస్త్రి నగర్ మున్సిపల్ ఆసుపత్రిలో జరిగింది. గర్భిణికి చికిత్స ఆలస్యమైందని ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బందిపై ఆరోపణలు చేయడంతో మాత్రేతో పాటు మరికొందరు అక్కడికి చేరుకున్నారు. అనంతరం వైద్యులపై దాడి జరిగినట్లు కేసు నమోదైంది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు బయటకు రావడంతో వైద్యులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో వైద్యుల భద్రత, ఆసుపత్రుల్లో దాడులను అరికట్టడం, ఇలాంటి కేసుల్లో బెయిల్ విషయంలో న్యాయస్థానాల వైఖరిపై సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
#SupremeCourt #DoctorsSafety #AttackOnDoctors #HospitalViolence #MedicalProfessionals #DoctorsSecurity #Maharashtra #Thane #RameshMhatre #BombayHighCourt #HospitalAttack #HealthcareWorkers #IndianJudiciary #MedicalSafety











