నాడు వెంటపడి లోన్లు.
నేడు రికవరీలంటూ ఒత్తిళ్లు.
బంగారం ధరల పతనంతో తాకట్టు సంస్థల కొత్త మాయాజాలం.. అప్పు తీసుకున్నవారికి తప్పని ఆర్థిక ఉచ్చు!
ధర పెరిగితే ప్రేమ.. తగ్గితే భారం!
బంగారం ధర పెరుగుతున్నప్పుడు పోటాపోటీగా గోల్డ్ లోన్లు ఇచ్చిన బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు ఇప్పుడు రికవరీల కోసం రుణగ్రహీతల వెంటపడుతున్నాయి. కొత్త కస్టమర్ల కోసం ఒకప్పుడు ఫోన్లు చేసి మరీ లోన్లు ఇచ్చిన సంస్థలు, ఇతర కంపెనీల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని కూడా టేకోవర్ చేసి అదనపు రుణాలు మంజూరు చేశాయి. ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయంటూ ఎక్కువ మొత్తంలో అప్పులు తీసుకునేలా ప్రోత్సహించాయి. ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. 2025 జనవరిలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.80 వేలు ఉండగా, 2026 జనవరి, ఫిబ్రవరిలో రూ.1.80 లక్షలు దాటింది. తాజాగా అదే ధర రూ.1.28 లక్షలకు పడిపోయింది. అంటే గరిష్ఠ ధరతో పోలిస్తే 10 గ్రాములపై రూ.50 వేలకు పైగా విలువ ఆవిరైంది. ఈ పరిణామం రైతులు, చిన్న వ్యాపారులు, మహిళలను ఆందోళనకు గురిచేస్తోంది.
ఎల్టీవీ పేరుతో కొత్త ఒత్తిడి!
బంగారం విలువలో సాధారణంగా 70 నుంచి 80 శాతం వరకు రుణాలు ఇచ్చే సంస్థలు ఇప్పుడు ధరల పతనాన్ని సాకుగా చూపుతున్నాయి. బంగారం విలువ తగ్గడంతో రుణానికి, తాకట్టు విలువకు మధ్య నిష్పత్తి పెరిగిపోయింది. ఉదాహరణకు రూ.15 లక్షల విలువైన బంగారంపై రూ.11.25 లక్షలు అప్పుగా తీసుకుంటే, ఆ బంగారం విలువ రూ.12 లక్షలకు పడిపోయినప్పుడు రుణ భారం తాకట్టు విలువలో 93 శాతానికి చేరుతుంది. దీంతో అదనపు నగదు చెల్లించాలని లేదా మరికొంత బంగారం తాకట్టు పెట్టాలని మార్జిన్ కాల్స్ ఇస్తున్నాయి. నాడు వెంటపడి లోన్లు ఇచ్చిన సంస్థలే నేడు ఫోన్లు, నోటీసులతో ఒత్తిడి చేస్తున్నాయని ఖాతాదారులు వాపోతున్నారు. ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నిస్తున్నారు.
సామాన్యుడి బంగారంపైనే గురి!
బంగారం ధర తగ్గిందని ఆందోళనతో ఆభరణాలను వదులుకోవద్దని గోల్డ్ అప్రైజర్లు సూచిస్తున్నారు. కొంత మొత్తం చెల్లించడం, అవసరమైతే అదనంగా బంగారం తాకట్టు పెట్టడం ద్వారా రుణ నిష్పత్తిని సర్దుబాటు చేసుకోవచ్చని చెబుతున్నారు. బ్యాంకుల నుంచి నోటీసులు వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే బ్రాంచ్‌ను సంప్రదించి గడువు కోరాలని సూచిస్తున్నారు. నోటీసులకు స్పందించకపోతే తాకట్టు బంగారం వేలం వేసే ప్రమాదం ఉంది. మార్కెట్ ధరల హెచ్చుతగ్గుల మధ్య లాభనష్టాలను లెక్కించే సంస్థలకు వ్యాపారమే ముఖ్యం కావచ్చు. కానీ కుటుంబ అవసరాల కోసం ఆభరణాలు తాకట్టు పెట్టిన సామాన్యుడికి మాత్రం అవే చివరి ఆస్తులు. ధర పెరిగినప్పుడు రుణాల కోసం ప్రోత్సహించి, తగ్గినప్పుడు రికవరీల పేరుతో ఉక్కిరిబిక్కిరి చేయడంలో సంస్థల బాధ్యత ఎంత? ఈ బంగారు వ్యాపారంలో సామాన్యుడి పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి.
#GoldLoans #GoldPriceDrop #GoldLoanBorrowers #GoldLoanRecovery #MarginCalls #LTVRatio #GoldPrices #BankLoans #FinancialPressure #GoldJewellery











