Home AP పోలవరం నిర్మాణంపై నాణ్యత తనిఖీలు!

పోలవరం నిర్మాణంపై నాణ్యత తనిఖీలు!

డ్యామ్‌ పనుల్లో నిపుణుల ప్రత్యేక పరీక్షలు.
సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ బృందం క్షేత్రస్థాయి పరిశీలన.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను నిర్ధారించేందుకు కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని కేంద్ర మృత్తిక, పదార్థాల పరిశోధన కేంద్రం (సీఎస్‌ఎంఆర్‌ఎస్‌) నిపుణులు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ప్రారంభమైన ఈ పరిశీలనలు నవంబర్‌ 26 వరకు కొనసాగనున్నాయి. జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) ప్రతినిధుల సమక్షంలో పరీక్షలు జరుగుతున్నాయి. నిపుణులు హరీంద్ర ప్రకాశ్‌, శ్రీహరి టి. నాయర్‌, అమిత్‌ సేన్‌ ఈ తనిఖీల్లో పాల్గొంటున్నారు. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణానికి ఉపయోగిస్తున్న మట్టి, రాయి, ఇసుక నాణ్యతతో పాటు వాటి సాంద్రత, కుదింపు స్థితిని పరిశీలిస్తున్నారు. ప్రతి నెలా ప్రాజెక్టును సందర్శించే నిపుణులు ఎంపిక చేసిన ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించడంతో పాటు నమూనాలను సేకరించి ప్రాజెక్టు వద్ద ఉన్న పరీక్షా కేంద్రంలోనూ తనిఖీ చేస్తున్నారు.

గ్యాప్‌-1, గ్యాప్‌-2ల్లో డెన్సిటీ పరీక్షలు

తొలిరోజు ప్రాజెక్టులోని కీలక ప్రాంతాల్లో సాంద్రత పరీక్షలు చేపట్టారు. గ్యాప్‌-1 ఎగువ భాగంలో 0 నుంచి 200 మీటర్ల పరిధిలో రాక్‌ఫిల్‌ (3ఏ)పై వాటర్‌ రీప్లేస్‌మెంట్‌ పద్ధతిలో డెన్సిటీ పరీక్ష నిర్వహించారు. షీప్‌ఫుట్‌ రోలర్‌తో మట్టిని కుదించిన అనంతరం దాని సాంద్రత, తేమ శాతాన్ని పరిశీలించారు. నిర్మాణంలో ఉపయోగిస్తున్న పదార్థాలు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది నిపుణులు పరీక్షిస్తున్నారు. గ్యాప్‌-2లోనూ ఇదే తరహా తనిఖీలు కొనసాగించారు. ఈ పరిశీలనల్లో జలవనరుల శాఖ ఈఈ బాలకృష్ణమూర్తి, డీఈలు నిర్మల, శ్రీకాంత్‌, విజయ్‌, మల్లికార్జున, పటేల్‌, ఎంఈఐఎల్‌ జనరల్‌ మేనేజర్‌ ఏ. గంగాధర్‌ కుమార్‌, డీజీఎంలు గుట్టపాటి శంకరయ్య, మురళి పమ్మి తదితరులు పాల్గొన్నారు. నిర్మాణ నాణ్యతను క్షేత్రస్థాయిలో నిర్ధారించడమే ఈ పరీక్షల ప్రధాన ఉద్దేశం.

 

#PolavaramProject #PolavaramDam #CSMRS #ECRFDam #DamConstruction #QualityTests #Gap1 #Gap2 #MEIL #AndhraPradesh