Home Telangana పేదింటి ఆడబిడ్డలకు భరోసా కళ్యాణలక్ష్మిపై బీఆర్ఎస్ సమరం

పేదింటి ఆడబిడ్డలకు భరోసా కళ్యాణలక్ష్మిపై బీఆర్ఎస్ సమరం


రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు
రద్దుపై కాంగ్రెస్‌కు కేటీఆర్ వార్నింగ్

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. హైకోర్టు తీర్పును సాకుగా చూపి పేదింటి ఆడబిడ్డలకు అందుతున్న ఆర్థిక భరోసాను తొలగించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ ప్రభుత్వం 2014 అక్టోబర్‌ 2న ఈ పథకాలను ప్రారంభించిందని గుర్తుచేశారు. రూ.51 వేలతో మొదలైన సాయం రూ.75,116కు, తర్వాత రూ.1,00,116కు పెరిగిందన్నారు. కేసీఆర్‌ పాలనలో సుమారు 13 లక్షల కుటుంబాలకు రూ.13 వేల కోట్ల మేర సాయం అందిందని తెలిపారు. కోవిడ్‌ సమయంలోనూ పథకం కొనసాగిందని చెప్పారు.

కౌంటర్‌ ఎందుకు వేయలేదు?

కళ్యాణలక్ష్మి అంశంలో హైకోర్టుకు ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై కేటీఆర్‌ తీవ్రంగా ప్రశ్నించారు. నాలుగుసార్లు గడువు ఇచ్చినా కౌంటర్‌ ఎందుకు వేయలేదని నిలదీశారు. ముఖ్యమంత్రి, మంత్రులకు సంబంధించిన వివిధ కేసుల్లో ప్రైవేటు న్యాయవాదులకు భారీగా ఖర్చు చేసే ప్రభుత్వం.. పేద ఆడబిడ్డల ప్రయోజనాలకు సంబంధించిన అంశంలో ఎందుకు సరైన న్యాయపోరాటం చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిందని, ఇప్పుడు ఆ హామీపై ఆడబిడ్డలు ప్రశ్నిస్తుండటంతో పథకాన్నే ఎత్తివేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. పెళ్లిళ్లు పూర్తయినా సాయం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న లబ్ధిదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ కేవలం సంక్షేమ పథకాలు కాదని, పేద కుటుంబాల ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ఆర్థిక భరోసాకు ప్రతీకలని కేటీఆర్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు ఉద్యమించాలన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర జనరల్‌ బాడీ సభ్యులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. పెండింగ్‌లో ఉన్న అర్హులైన దరఖాస్తులన్నింటినీ వెంటనే పరిష్కరించి ఆర్థిక సాయం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

#KTR #KalyanaLakshmi #ShaadiMubarak #BRS #Congress #TelanganaPolitics #KTRWarning #KalyanaLakshmiScheme #TelanganaWelfare #KCR #BRSProtest #StatewideProtests #WomenWelfare #TelanganaNews #TelanganaGovernment