మంత్రి తుమ్మలపై పువ్వాడ విమర్శలు.
మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఖమ్మం రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎక్కడికీ వెళ్లబోనని, ఖమ్మం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తనపై వస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. నాలుగు దశాబ్దాలుగా పువ్వాడ కుటుంబానికి ఖమ్మంతో విడదీయరాని అనుబంధం ఉందన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన పువ్వాడ.. తుమ్మల ఏ పార్టీలో ఉన్నా మంత్రి పదవులు అనుభవించారని, ఖమ్మం అభివృద్ధికి మాత్రం చెప్పుకునే స్థాయిలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరూ చేయని పనులను తానే చేశానని చెప్పుకోవడం తప్ప ఖమ్మానికి తుమ్మల చేసిందేమీ లేదని ఆరోపించారు.
కళ్యాణలక్ష్మిపై కాంగ్రెస్ కుట్ర
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని పువ్వాడ తప్పుబట్టారు. హైకోర్టులో పిల్ దాఖలైన అంశంలో ప్రభుత్వం సరైన కౌంటర్ ఇవ్వకుండా వ్యవహరించిందని ఆరోపించారు. కేసీఆర్ పేరు గుర్తుకు వస్తుందనే కారణంతో పేద ఆడబిడ్డలకు అండగా ఉన్న కళ్యాణలక్ష్మిని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ఒక ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను మరో ప్రభుత్వం కొనసాగించడం సాధారణ విషయమన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించలేదా అని ప్రశ్నించారు. సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణంలో నాణ్యతా లోపాలు కనిపిస్తున్నాయని, నిర్మాణం పూర్తయిన ఏడాదికే సీసీ లైనింగ్ దెబ్బతినడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు.
ఖమ్మం అభివృద్ధిపై లెక్కలు
తుమ్మల నాగేశ్వరరావు, ఆయన అనుచరులు ఇసుక, మట్టి, భూ వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని పువ్వాడ ఆరోపించారు. మున్నేరు తీగల వంతెన, రక్షణ గోడలు, ఇంజినీరింగ్ కాలేజీ, ఖమ్మం బస్‌స్టాండ్, గోళ్లపాడు చానల్ అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వమే శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. దేవరపల్లి–ఖమ్మం జాతీయ రహదారికి తుమ్మల క్రెడిట్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. హైవేపై వరుస ప్రమాదాలు జరుగుతున్నా ప్రజల భద్రతపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. 2029 ఎన్నికల్లో ఖమ్మం నుంచే తన రాజకీయ పోరాటం కొనసాగుతుందని పువ్వాడ మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా బీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీతోనే ఉన్నారని, వారిని కాపాడుకుంటామని చెప్పారు. రేవంత్‌రెడ్డి పాలనను అట్టర్ ఫ్లాప్ సినిమాతో పోల్చుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
#PuvvadaAjayKumar #PuvvadaAjay #TummalaNageswaraRao #Khammam #KhammamPolitics #BRS #Congress #TelanganaPolitics #KCR #RevanthReddy #KalyanaLakshmi #ShaadiMubarak #KhammamDevelopment #TelanganaElections #2029Elections











