బీఆర్‌ఎస్ పాలనపై బండి సంజయ్ ఫైర్
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల వ్యాఖ్యలనే ఆ పార్టీ పాలనకు రిపోర్టు కార్డుగా అభివర్ణించారు. “కేసీఆర్ పాలనకు మీ పిల్లలే రిపోర్టు కార్డు ఇస్తున్నారు” అంటూ బీఆర్‌ఎస్‌పై సెటైర్లు వేశారు. అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో మంచి పాఠశాలలు, కళాశాలలు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. విద్యా సంస్థల్లో ఉపాధ్యాయుల కొరత ఎందుకు ఏర్పడింది? యూనివర్సిటీల్లో ఖాళీలు ఎందుకు భర్తీ చేయలేదు? పేపర్ లీకులు ఎందుకు జరిగాయి? ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను సకాలంలో ఎందుకు చెల్లించలేదని నిలదీశారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు, విద్యా సంస్థలకు నిధుల కొరతపై పదేళ్ల పాలనలో ఎందుకు చర్యలు తీసుకోలేదని బండి సంజయ్ ప్రశ్నించారు.
‘సోర్ గ్రేప్స్’ అంటూ ఎద్దేవా
అధికారంలో ఉన్నప్పుడు విద్యా వ్యవస్థను బలోపేతం చేయకుండా, అధికారం కోల్పోయిన తర్వాత దేశంలో మంచి కళాశాలలు లేవని చెప్పడం ‘సోర్ గ్రేప్స్’ ధోరణేనని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రత్యర్థుల పిల్లలు ఏం చదువుతున్నారో, వారి ఫోన్లను ట్యాప్ చేయడంపై దృష్టి పెట్టే బదులు సొంత పిల్లల మాటలు విని ఉంటే విద్యా వ్యవస్థ మెరుగుపడేదని ఎద్దేవా చేశారు. భారత్ కంటే శ్రీలంక గొప్పదనే అభిప్రాయాలను కూడా ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడటం దేశభక్తి కాదన్నారు. కాంగ్రెస్ వందేమాతరంపై వివాదానికి దారితీస్తోందని, బీఆర్‌ఎస్ దేశంలోని విద్యా వ్యవస్థపై విమర్శలు చేస్తోందని ప్రస్తావించారు. తనకు జాతీయత రాజకీయ అంశం కాదని, జీవితకాల నమ్మకమని స్పష్టం చేశారు. కాషాయ జెండా, త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ధరిస్తానని, దేశం కోసం అవసరమైతే తన రక్తాన్ని సైతం ఇస్తానని బండి సంజయ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
‘నేషన్ ఫస్ట్’ అంటూ స్పష్టత
భారత్ మాతాకీ జై అంటూ జీవితాంతం పనిచేసిన కార్యకర్తకు దేశం అంటే కేవలం రాజకీయ నినాదం కాదని బండి సంజయ్ పేర్కొన్నారు. దేశమే ముందు.. ఎప్పుడూ దేశమే ముందు అనే సందేశంతో తన ట్వీట్‌ను ముగించారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో విద్యారంగం, యూనివర్సిటీలు, ఉపాధి అవకాశాల విషయంలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలు పరిశీలించాలని సూచించారు. అధికారంలో ఉన్నప్పుడు పరిష్కరించాల్సిన సమస్యలను పట్టించుకోకుండా, ఇప్పుడు వాటిపై విమర్శలు చేయడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల విద్యా వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ సొంత ఇంటి నుంచే బీఆర్‌ఎస్ పాలనపై ప్రశ్నలు వస్తున్నాయంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి.
#BandiSanjay #KCR #BRS #BRSRule #TelanganaPolitics #TelanganaEducation #KCRGovernment #BRSReportCard #PaperLeaks #FeeReimbursement #UniversityVacancies #Congress #BJP #NationFirst #TelanganaNews











