Home Telangana కేసీఆర్ కుటుంబ భూములపై విచారణ జరగాలి

కేసీఆర్ కుటుంబ భూములపై విచారణ జరగాలి

అఫిడవిట్ల లెక్కలపై నిగ్గు తేల్చాలన్న పీసీసీ చీఫ్.

కేసీఆర్ కుటుంబ భూములపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2004, 2009 ఎన్నికల అఫిడవిట్లలో కేసీఆర్‌కు భూములు లేవని చూపించగా.. 2014లో 35 ఎకరాలు, 2023 నాటికి 53 ఎకరాలు ఉన్నట్లు నమోదైందని ఆయన తెలిపారు. కేటీఆర్ కుటుంబానికి 2023 నాటికి 123 ఎకరాలు ఉన్నాయని, 2026లో కేటీఆర్ 67 ఎకరాలు కొనుగోలు చేశారని పేర్కొన్నారు. ఎన్నికల అఫిడవిట్లలో చూపిన వివరాలకు ప్రస్తుత ఆస్తులకు పొంతన ఉందా అనే అంశంపై సమగ్ర విచారణ అవసరమని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో భూమిలేని పేదలు ఎంతో మంది ఉన్నప్పుడు ఈ స్థాయిలో భూములు ఎలా సమకూరాయో కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలని అన్నారు.

జన్వాడ, 22ఏపైనా విచారణ

జన్వాడ ఫామ్‌హౌస్‌ తనది కాదని కేటీఆర్‌ చెబుతున్నప్పటికీ అక్కడ ఆయన ఉంటున్నట్లు సమాచారం ఉందని మహేశ్‌ గౌడ్‌ వ్యాఖ్యానించారు. ఫామ్‌హౌస్‌ నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించారన్నది తమ ఆరోపణగా పేర్కొన్నారు. అయితే ప్రభుత్వానికి ఎవరి ప్రైవేట్‌ ఆస్తులను స్వాధీనం చేసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. 22ఏ నిషేధిత జాబితాలో తప్పులు జరిగి ఉంటే వాటిపైనా విచారణ జరుగుతోందన్నారు. మరోవైపు స్పీకర్‌ తల్లిపై బీఆర్ఎస్‌ నేతలు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. పోలీసుల పట్ల వారి వ్యవహారశైలిని కూడా విమర్శించారు.

కాంగ్రెస్‌ గ్రాఫ్‌పై మహేశ్‌ గౌడ్‌ వ్యాఖ్య

తెలంగాణలో భూముల వ్యవహారం రాజకీయంగా వేడెక్కిన సమయంలో మహేశ్‌ గౌడ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కేసీఆర్ కుటుంబ ఆస్తులపై కచ్చితమైన రికార్డుల ఆధారంగా సమగ్ర విచారణ జరగాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో వివరాలు వెల్లడించిన తర్వాత దళితులు, బీసీ వర్గాల్లో చర్చ పెరిగిందని తెలిపారు. ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ నాయకత్వంలో పార్టీ గ్రాఫ్‌ పెరిగిందని మహేశ్‌ గౌడ్‌ పేర్కొన్నారు.

 

#KCRFamily #KCRLandHoldings #MaheshKumarGoud #KCRAssets #KCRAffidavit #KTRAssets #KTRLandHoldings #ErravelliLand #JanwadaFarmhouse #22ALands #RevanthReddy #TelanganaPolitics #BRS #Congress #TelanganaLandIssue