బకాయిల వసూళ్లు.. మిల్లర్లకు చెక్
ధాన్యం నిల్వకు సైలో బ్యాగ్ ప్లాన్
ప్రతి గింజకు లెక్క తేలాల్సిందే
మిల్లర్లు బకాయిపడిన ధాన్యం విలువ మొత్తాన్ని పూర్తిగా వసూలు చేయాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పౌరసరఫరాల శాఖపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి నిర్వహించిన సమీక్షలో బకాయిల అంశంపై కీలక ఆదేశాలు ఇచ్చారు. వ్యాపారపరంగా మిల్లులు నిర్వహించే వారితో సానుకూలంగా ఉంటామని, కావాలనే బకాయిలు ఎగ్గొట్టే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. బకాయిల వసూలుకు స్పష్టమైన విధివిధానాలు రూపొందించి, మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మొండి బకాయిదారులకు ధాన్యం కేటాయించకుండా.. ఆ బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించే అంశాన్ని కూడా పరిశీలించాలని సూచించారు.
ఐదు జిల్లాల్లో సైలో బ్యాగ్‌లు
ప్రతి ధాన్యం సీజన్‌లో ఎదురవుతున్న నిల్వ సమస్యకు ఇప్పటి నుంచే పరిష్కారం సిద్ధం చేయాలని సీఎం సూచించారు. ధాన్యం భారీగా వచ్చే నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా సైలో బ్యాగ్ నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో నియోజకవర్గానికి 50 నుంచి 100 ఎకరాల భూమిని కేటాయించే అవకాశం ఉందని సీఎం తెలిపారు. దీంతో గ్రామీణ మహిళా సంఘాలకు ఉపాధి, ధాన్యం నిల్వకు అదనపు సామర్థ్యం కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.
గోదాముల నుంచి పాత థియేటర్ల వరకు
ధాన్యం నిల్వకు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా వెంటనే గుర్తించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. మండల, గ్రామ స్థాయిలో ఉన్న ప్రైవేట్ గోదాములు, కల్యాణ మండపాలు, పాత థియేటర్లు, ఇతర షెడ్లను ముందుగానే గుర్తించి అవసరమైతే లీజుకు తీసుకోవాలని సూచించారు. విశాలమైన ప్లాట్‌ఫాంలు ఏర్పాటు చేసి జర్మన్ టెంట్లలో ధాన్యం నిల్వ చేసే అవకాశాన్ని పరిశీలించాలని చెప్పారు. మిల్లర్ల బకాయిలపై కఠిన వైఖరి.. ధాన్యం నిల్వపై ముందస్తు ప్రణాళిక.. రైతు పండించిన ప్రతి గింజకు లెక్క, నిల్వకు భరోసా ఉండేలా పౌరసరఫరాల వ్యవస్థను బలోపేతం చేయడమే తాజా సమీక్షలో ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
#RevanthReddy #RiceMillers #MillersDues #PaddyProcurement #PaddyStorage #TelanganaCivilSupplies #SiloBags #TelanganaFarmers #GrainStorage #UttamKumarReddy #TelanganaGovernment #SelfHelpGroups #Nalgonda #Suryapet #Nizamabad #Peddapalli #Kamareddy #TelanganaNews










