Home Telangana కేబీఆర్‌ ఫ్లైఓవర్‌ ప్లాన్‌లో మార్పులు!

కేబీఆర్‌ ఫ్లైఓవర్‌ ప్లాన్‌లో మార్పులు!

వన్‌వే సక్సెస్‌తో జీహెచ్ఎంసీ నయా ప్లాన్

హైదరాబాద్‌లో కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ప్రతిపాదించిన ఫ్లైఓవర్‌ ప్రాజెక్ట్‌ పూర్తిగా మారిపోయింది. వన్‌వే ట్రాఫిక్‌ విధానం విజయవంతం కావడం, కోర్టు కేసుల కారణంగా పనుల్లో ఎదురైన జాప్యం వంటి అంశాల నేపథ్యంలో 14 ఫ్లైఓవర్ల పాత ప్రణాళికను ప్రభుత్వం ఒకే సమగ్ర ఎలివేటెడ్‌ కారిడార్‌గా మార్చిందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి. కర్ణన్‌ తెలిపారు. సోమవారం కేబీఆర్‌ పార్క్‌ పరిసరాల్లో అధికారులతో కలిసి పనులను పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త ప్రతిపాదనలో జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ నుంచి ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌ వరకు 4.3 కిలోమీటర్ల ఫ్లైఓవర్‌ నిర్మించనున్నారు. ఈ మార్పుతో కేబీఆర్‌ పార్క్‌ నుంచి ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌ వరకు కొనసాగుతున్న ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు.

రూ.800 కోట్ల భూసేకరణ భారం తగ్గింపు

కొత్త ప్రాజెక్టు ద్వారా అధిక విలువైన ప్రైవేట్‌ భూముల సేకరణను గణనీయంగా తగ్గించడంతో సుమారు రూ.800 కోట్లు ఆదా అవుతాయని జీహెచ్‌ఎంసీ వెల్లడించింది. గతంలో చెట్ల తొలగింపునకు సంబంధించిన అనుమతులపై కోర్టు వివాదాలు తలెత్తడంతో నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయని కమిషనర్‌ తెలిపారు. కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ డివైడర్లలో ఉన్న చెట్లను తొలగించడంపై గతంలో తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే పర్యావరణానికి జరిగిన నష్టానికి ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందా అన్న అంశంపై కమిషనర్‌ స్పష్టత ఇవ్వలేదు. కొత్త ప్రాజెక్టు రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో కొనసాగనుంది. సిగ్నల్‌ రహిత రాకపోకలకు వీలుగా
మూడు లేన్లతో వెళ్లే మార్గం, మూడు లేన్లతో వచ్చే మార్గం కలిగిన ఉక్కు వంతెన నిర్మించనున్నారు.

రెండు ప్యాకేజీలుగా స్టీల్‌ ఫ్లైఓవర్‌

ఈ భారీ కారిడార్‌ను ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌ (ఈపీసీ) విధానంలో రెండు ప్యాకేజీలుగా చేపట్టనున్నారు. మొదటి ప్యాకేజీలో జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ జంక్షన్‌ నుంచి ముగ్ధ జంక్షన్‌ వరకు స్టీల్‌ ఫ్లైఓవర్‌ నిర్మించనున్నారు. దీని అంచనా వ్యయం రూ.580 కోట్లు. రెండో ప్యాకేజీలో ముగ్ధ జంక్షన్‌ నుంచి ముఫకంజా కాలేజీ వరకు ఫ్లైఓవర్‌ నిర్మించడంతో పాటు బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 1కు ప్రత్యేక కనెక్టింగ్‌ ర్యాంప్‌ ఏర్పాటు చేయనున్నారు. వేగంగా నిర్మాణం పూర్తి చేసేందుకు ఆధునిక స్టీల్‌ నిర్మాణ సాంకేతికతను ఉపయోగించనున్నట్లు జీహెచ్‌ఎంసీ తెలిపింది. దీంతో కేబీఆర్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ నిర్వహణకు కొత్త రూపు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు.

 

#KBRPark #KBRParkFlyover #HyderabadTraffic #GHMC #ElevatedCorridor #JubileeHills #NFCLJunction #HCity #HCITI #RVCarnan #HyderabadInfrastructure #SteelFlyover #FlyoverProject #BanjaraHills #HyderabadDevelopment