Home AP విజయవాడ మేయర్‌ రేసులో ఏబీవీ!

విజయవాడ మేయర్‌ రేసులో ఏబీవీ!

వామపక్షాల మద్దతుతో బరిలోకి మాజీ ఐపీఎస్‌.
అనూహ్య ప్రతిపాదన… నేడు నామినేషన్ .

విజయవాడ మేయర్‌ ఎన్నికల పోరులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) స్వతంత్ర అభ్యర్థిగా మేయర్‌ పదవికి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. విజయవాడలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వామపక్ష పార్టీల ప్రతినిధులు ఆయనను సంప్రదించి, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే మద్దతు ఇస్తామని ప్రతిపాదించారు. ఇందుకు ఏబీవీ అంగీకరించారు. అనంతరం ఆయా పార్టీల్లో అంతర్గత చర్చలు జరిగాయి. శనివారం రాత్రి 8 గంటల సమయానికి సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్‌ పార్టీల నుంచి అంగీకారం లభించినట్లు ఏబీవీ వెల్లడించారు. ఈ పరిణామంతో విజయవాడ మేయర్‌ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది.

ఫాసిస్టు శక్తులకు ప్రత్యామ్నాయం

మేయర్‌ పదవికి పోటీ చేయాలనే నిర్ణయం వెనుక రాజకీయ కారణాలను ఏబీవీ తన లేఖలో వివరించారు. టీడీపీ, జనసేన, వైఎస్సార్‌సీపీ వంటి ప్రధాన పార్టీలు ఫాసిస్టు శక్తులతో చేతులు కలుపుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. దీనివల్ల ప్రజాస్వామ్య, లౌకిక, రాజ్యాంగ విలువలకు ముప్పు ఏర్పడుతోందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు నిజమైన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని అందించడం, రాజకీయ సంస్కృతిలో మార్పు తీసుకురావడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. పలు పార్టీలు, ప్రజా సంఘాలు తనను పోటీ చేయాలని కోరడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు రాసిన లేఖలో తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని, కాంగ్రెస్‌ శ్రేణులు తన తరఫున ప్రచారం చేసి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

నేడు నామినేషన్‌.. మద్దతుదారులకు పిలుపు

ఏబీవీ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకల్లా మద్దతుదారులంతా వినాయకుడి ఆలయం వద్దకు చేరుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తన అభ్యర్థిత్వాన్ని బలపరచడంతో పాటు విజయవాడ మేయర్‌గా ఎన్నుకోవాలని నగర ఓటర్లను కోరారు. నామినేషన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. వామపక్షాలు, కాంగ్రెస్‌ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా ఏబీవీ బరిలోకి దిగుతుండటం విజయవాడ మేయర్‌ ఎన్నికల్లో కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీసే అవకాశముంది. ఆయనకు మరిన్ని పార్టీల మద్దతు లభిస్తుందా, ప్రధాన పార్టీల వ్యూహాలు ఎలా మారతాయన్నది ఆసక్తికరంగా మారింది.

 

#ABVenkateswaraRao #ABV #VijayawadaMayor #VijayawadaPolitics #MayorElection #FormerIPSOfficer #IndependentCandidate #CPI #CPM #Congress #YSSharmila #AndhraPradeshPolitics