Home Telangana ఇందిరమ్మ టవర్స్.. పేదల సొంతింటి కల

ఇందిరమ్మ టవర్స్.. పేదల సొంతింటి కల


నగరంలోనే నివాసం.. నిరుపేదలకు భరోసా
కూకట్‌పల్లిలో టవర్స్‌కు శంకుస్థాపన

హైదరాబాద్‌లో సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కూకట్‌పల్లి నియోజకవర్గంలో గురువారం సీఎం రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఐదు ఎకరాల్లో నాలుగు టవర్లను నిర్మించనున్నారు. ఒక్కో టవర్‌లో 120 ఫ్లాట్ల చొప్పున మొత్తం 480 ఇళ్లు నిర్మించనున్నారు. రూ.43.20 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టులో ఒక్కో ఇంటి విస్తీర్ణం సుమారు 525 చదరపు అడుగులు ఉండనుంది. బెడ్‌రూమ్, హాల్, కిచెన్‌తో ఆధునిక సౌకర్యాలతో ఇళ్లను నిర్మించనున్నారు. హైదరాబాద్‌లో భూముల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో నగరానికి దూరంగా కాకుండా నగరంలోనే పేదలకు ఇళ్లు కల్పించడమే లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

ఏడాదిలో లక్ష ఇళ్లు.. 16 నియోజకవర్గాల్లో తొలి అడుగు

క్యూర్ పరిధిలో ఏడాదిలో లక్ష ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలి విడతలో 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 8 వేల ఇళ్లను నిర్మించనున్నారు. ఇందిరమ్మ టవర్స్ కోసం ఇప్పటికే సుమారు 90 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. కీలక ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి పది అంతస్తుల వరకు టవర్లను నిర్మించనున్నారు. లబ్ధిదారులకు ఇంటితో పాటు అన్‌డివైడెడ్ షేర్ కింద 20 నుంచి 25 గజాల స్థల వాటాను వారి పేరుతో రిజిస్టర్ చేయనున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ భూమి వాటా విలువ రూ.60 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉండొచ్చని మంత్రి తెలిపారు. ఆగస్టు 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటికే సుమారు 50 వేల దరఖాస్తులు వచ్చాయి.

లక్కీడిప్‌తో కేటాయింపు.. వచ్చే ఏడాది గృహప్రవేశాలు

అర్హతలను పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎలాంటి రాజకీయ జోక్యం, సిఫార్సులకు తావులేకుండా పారదర్శక లక్కీడిప్ ద్వారా ఇళ్లను కేటాయిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇల్లు రాని దరఖాస్తుదారులకు ఈఎండీ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని మంత్రి స్పష్టం చేశారు. నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది బోనాల పండుగ సమయానికి లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. హైదరాబాద్‌లో ఆకాశాన్నంటుతున్న భూముల ధరల మధ్య.. ప్రభుత్వ భూమిని సద్వినియోగం చేసుకుని నగరంలోనే పేదలకు ఇల్లు అందించాలన్న ఇందిరమ్మ టవర్స్ ప్రాజెక్టు ఎంతవరకు లక్ష్యాన్ని చేరుతుందన్నదే ఇప్పుడు కీలకం.

 

#IndirammaTowers #IndirammaHouses #HyderabadHousing #RevanthReddy #Kukatpally #TelanganaHousing #AffordableHousing #HousingForPoor #TelanganaGovernment #IndirammaHousing #PonguletiSrinivasReddy #Hyderabad #GovernmentHousing #PoorFamilies #MiddleClassHousing #TelanganaNews #HousingScheme