Home Telangana పక్కాగా సర్ లెక్కలు రెండు చోట్ల ఓటుంటే ఏడాది జైలు

పక్కాగా సర్ లెక్కలు రెండు చోట్ల ఓటుంటే ఏడాది జైలు

19


తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 98 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందని వెల్లడించారు. ఈ నెల 24 వరకు ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఎవరికైనా ఎన్యూమరేషన్ ఫారం అందకపోతే ఆగస్టులో ఫారం-6, ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఓటు ఉండి కూడా ఫారం అందని వారు తమ బీఎల్‌వోను సంప్రదించాలని కోరారు.

89 లక్షల అనుమానాస్పద ఓటర్ల గుర్తింపు

తెలంగాణలో తప్పుడు వివరాలు ఉన్నట్లు భావిస్తున్న 89 లక్షల ఓటర్లను ఎన్నికల సంఘం గుర్తించిందని సుదర్శన్ రెడ్డి తెలిపారు. అక్షర దోషాలు, ఇతర వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు త్వరలో నోటీసులు జారీ చేయనున్నట్లు చెప్పారు. ఓటర్ల జాబితాను పూర్తిగా ప్రక్షాళన చేయడమే ఈ ప్రత్యేక సర్వే లక్ష్యమని వివరించారు. 2002కు సంబంధించిన వివరాలు లేని ఓటర్లకు కూడా ప్రత్యేక నోటీసులు ఇచ్చి మరోసారి పరిశీలన చేపట్టనున్నట్లు వెల్లడించారు.

రెండు చోట్ల ఓటు ఉంటే శిక్ష

ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తైన తర్వాత ఒక వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉన్నట్లు తేలితే చట్టపరమైన చర్యలు తప్పవని సీఈవో హెచ్చరించారు. దేశవ్యాప్తంగా డీఎస్‌ఏ సాఫ్ట్‌వేర్ ద్వారా ద్వంద్వ ఓటర్లను గుర్తించి తొలగించే ప్రక్రియ చేపడతామని చెప్పారు. రెండు చోట్ల ఓటు ఉన్నట్లు నిర్ధారణ అయితే ఏడాది వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఓటరు జాబితాలో పారదర్శకత తీసుకురావడమే ఎన్నికల సంఘం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

జిల్లాల వారీగా వేగవంతం చేయాలని ఆదేశాలు

ఎస్‌ఐఆర్ 2026 పురోగతిపై భారత ఎన్నికల కమిషన్ సీనియర్ ఉప ఎన్నికల కమిషనర్ డాక్టర్ పవన్ కుమార్ శర్మ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి జిల్లా రోజువారీ లక్ష్యాలను తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఉత్తమ విధానాలు అమలు చేయాలి

ఎస్‌ఐఆర్ ప్రక్రియను సమర్థంగా నిర్వహిస్తున్న జిల్లాల అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా మాట్లాడింది. వారు అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను ఇతర జిల్లాలు కూడా అనుసరించాలని సూచించింది. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియలను ప్రతిరోజూ సమీక్షిస్తూ నిర్ణీత గడువులో పూర్తి చేయాలని రాష్ట్ర అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.

ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ

ఓటరు నమోదు, సవరణ అనేది నిరంతర ప్రక్రియ అని సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్ పూర్తయిన తర్వాత కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. కొత్తగా నమోదు చేసుకున్న వారికి నెల రోజుల్లో ఎన్నికల సంఘం ఓటరు గుర్తింపు కల్పిస్తుందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే 59 శాతం ఫారాలు తిరిగి వచ్చాయని వెల్లడించారు. పాతబస్తీ ఏడు నియోజకవర్గాల్లో కూడా ఫారాల సేకరణ పూర్తై డిజిటలైజేషన్ కొనసాగుతోందన్నారు. ఓటు లేకుంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రభావం ఉంటుందా లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.