ఆస్తి హక్కులకు అండగా ప్రభుత్వం
22-ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులతో చర్చించిన సీఎం.. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆస్తులు కలిగిన వారు రిజిస్ట్రేషన్లు చేసుకునే విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రెండు రోజుల్లోనే పరిశీలన
రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో స్లాట్ తీసుకున్న వ్యక్తి భూమి 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సంబంధిత రెవెన్యూ అధికారులు ఆ భూమిని రెండు రోజుల్లో పరిశీలించాలని… అది ప్రైవేట్ భూమిగా నిర్ధారణ అయితే వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. 22-ఏ జాబితాలో ఉన్న భూములను జిల్లా కలెక్టర్లు క్షుణ్నంగా పరిశీలించి సరైన జాబితాను రూపొందించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శాశ్వత పరిష్కారం దిశగా ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రైవేట్ భూములకు రక్షణ
ప్రజలు తమ భూ హక్కుల విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు. ప్రైవేట్ భూముల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. ప్రైవేట్ భూముల్లో ఒక్క అంగుళానికి కూడా ఇబ్బంది రానివ్వబోమని హామీ ఇచ్చారు. ఆస్తి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. 22-ఏ భూముల అంశాన్ని ఆసరాగా చేసుకుని ప్రజలను తప్పుదోవ పట్టించే దళారులు, మధ్యవర్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో ఎవరి మాటనో నమ్మి మోసపోవద్దని హెచ్చరించింది. ఈ అంశంపై వచ్చే పుకార్లు, కట్టుకథలను నమ్మవద్దని ప్రజలకు సూచించింది.
#22ALands #22A #Telangana #RevanthReddy #LandRegistration #TelanganaLandIssues #PropertyRights #PrivateLand #LandRights #TelanganaRevenue #PonguletiSrinivasReddy #TelanganaGovernment #22ARegistration #LandReforms #PropertyRegistration #TelanganaPolitics #RevenueDepartment #LandOwners #HyderabadNews #TelanganaNews











