Home Telangana వనపర్తిలో ఆధిపత్య పోరు.. “చిన్న” బుచ్చుకున్న” రెడ్డి” సారు

వనపర్తిలో ఆధిపత్య పోరు.. “చిన్న” బుచ్చుకున్న” రెడ్డి” సారు


ఉనికి కోసం “జీవన్” మరణ పోరాటం.
నియోజకవర్గ పట్టు కోసం ఆరాటం.
మేఘారెడ్డి వర్సెస్ చిన్నారెడ్డి వార్.

వనపర్తి కాంగ్రెస్‌లో మాటల మంటలు.. రాజకీయ ప్రకంపనలు! నిన్నటివరకు పార్టీ కోసం కలిసి నడిచిన నేతలే ఇప్పుడు ఒకరిపై ఒకరు కత్తులు దూసే పరిస్థితి. సీనియర్ నేత చిన్నారెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలతో వనపర్తి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెల్యే మేఘారెడ్డిపై టికెట్ నుంచి అభివృద్ధి పనుల వరకు సంచలన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాను కూడా జీవన్‌రెడ్డిలా తిరగబడతానన్న చిన్నారెడ్డి హెచ్చరిక కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. పార్టీని వీడనంటూనే.. పార్టీలోనే ఉంటూ కొందరిని బయటకు పంపిస్తానన్న వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. ఐతే చిన్నారెడ్డి వ్యాఖ్యలకు మెగా రెడ్డి అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. మాటలు కాదు రుజువులు చూపించాలంటూ వార్నింగ్ ఇచ్చారు. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొడతానంటూ హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు.



కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అంతర్గతంగా కొనసాగుతున్న అసంతృప్తి నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ కొనుక్కున్నారని చిన్నారెడ్డి ఆరోపించారు. తనకు సోనియా గాంధీ టికెట్ ఇచ్చి, డబ్బులు లేకపోతే స్వయంగా ఖర్చు పెట్టుకుని గెలిపించాలని రేవంత్ రెడ్డికి చెప్పారని పేర్కొన్నారు. అయితే డబ్బులకు ఆశపడి మేఘారెడ్డి వద్ద డబ్బులు తీసుకుని ఆయనకే టికెట్ ఇచ్చారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో మరోసారి నేతల మధ్య విభేదాలను తెరపైకి తెచ్చాయి.

అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేపై ఆరోపణలు

వనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎందుకు నిలిచిపోయాయని మంత్రులను కలిసి ప్రశ్నించినప్పుడు.. మేఘారెడ్డి పనులకు అడ్డుపడుతున్నారని మంత్రులు చెప్పారని చిన్నారెడ్డి తెలిపారు. కాంట్రాక్టులు తన అనుచరులకు దక్కలేదనే కారణంతో పనులను నిలిపివేస్తున్నారని, కొన్ని కాంట్రాక్టులను రద్దు చేయాలని అధికారులను కోరుతున్నారని పేర్కొన్నారు. మేఘారెడ్డి తన అనుచరులను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నారని చిన్నారెడ్డి ఆరోపించారు. దీంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయనే చర్చ మొదలైంది. పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం సరికాదని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

“జీవన్ రెడ్డిలా తిరగబడతా” హెచ్చరిక

పరిస్థితులు ఇలాగే కొనసాగితే తాను కూడా జీవన్ రెడ్డిలా పార్టీపై తిరగబడాల్సి వస్తుందని చిన్నారెడ్డి హెచ్చరించారు. అయితే కాంగ్రెస్ పార్టీని వీడే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. పార్టీలోనే ఉంటూ తప్పు చేస్తున్న వారిపై పోరాడతానని చెప్పారు. “పార్టీ వదిలి వెళ్లను.. మేఘారెడ్డి లాంటి తప్పుడు గాళ్లను పార్టీ నుంచి తరిమేస్తాను” అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చిన్నారెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్‌లో కొత్త రాజకీయ చర్చకు దారితీశాయి. ఇప్పటికే సీనియర్ నేతల అసంతృప్తి, స్థానిక నేతల మధ్య విభేదాలపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.


చిన్నారెడ్డికి ఎమ్మెల్యే మేఘా కౌంటర్

వనపర్తి కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిరంగ రచ్చకు దారితీశాయి. గత ఎన్నికల్లో తనకు టికెట్ దక్కకపోవడానికి డబ్బే కారణమని మాజీ మంత్రి చిన్నారెడ్డి చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తీవ్రంగా స్పందించారు. చిన్నారెడ్డి వ్యాఖ్యలను ఖండించిన ఆయన.. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం శాస్త్రీయంగా సర్వే నిర్వహించి, గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులకే టికెట్లు కేటాయించిందని స్పష్టం చేశారు. అనవసర ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు. తాను డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నానని చిన్నారెడ్డి ఆరోపిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి ఘాటుగా స్పందించారు. “నేను ఎవరికి డబ్బులు ఇచ్చానో.. వారి పేర్లను ధైర్యంగా బయటపెట్టండి” అంటూ చిన్నారెడ్డికి సవాల్ విసిరారు.

అస్త్ర సన్యాసం చేసింది చిన్నారెడ్డే..!

2014, 2018 ఎన్నికల్లో ఇకపై తాను పోటీ చేయబోనని, పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా వారి గెలుపు కోసం పనిచేస్తానని చిన్నారెడ్డి గతంలో చెప్పిన మాటలను గుర్తుచేశారు. ఇప్పుడు అందుకు భిన్నంగా మాట్లాడటం ఎందుకని ప్రశ్నించారు. చిన్నారెడ్డి ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని మేఘారెడ్డి వ్యాఖ్యానించారు. వనపర్తి నియోజకవర్గంలో అనవసర వ్యాఖ్యలు చేస్తూ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆరోపించారు. చిన్నారెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టాన పెద్దలకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. మొత్తంగా వనపర్తి కాంగ్రెస్‌లో ఈ వివాదం ఎటు దారితీస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

 

#Wanaparthy #Congress #ChinnaReddy #MeghaReddy #ToodiMeghaReddy #TelanganaCongress #WanaparthyPolitics #CongressInternalWar #CongressFactionWar #TelanganaPolitics #CongressTicket #PoliticalControversy #RevanthReddy #CongressDispute #WanaparthyMLA