Home Telangana ఆందోళన ముసుగులో అరాచకం! విద్యార్థుల పేరుతో విధ్వంసం

ఆందోళన ముసుగులో అరాచకం! విద్యార్థుల పేరుతో విధ్వంసం


ఢిల్లీ ఘటనపై బండి సంజయ్ ఆగ్రహం.

ఢిల్లీలో జరిగిన ఆందోళనలు నిజమైన విద్యార్థుల ఉద్యమం కాదని, మతతత్వ, కమ్యూనిస్టు శక్తులు చొరబడి దేశ వ్యతిరేక కుట్రలకు పాల్పడ్డాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. పార్లమెంట్‌పై దాడి చేసే ప్రయత్నం జరిగిందని, పోలీసులు, జర్నలిస్టులపై దాడులు చేయడం వెనుక పక్కా ప్రణాళిక ఉందని అన్నారు. డాక్టర్లు కావాలనుకునే విద్యార్థులు రాళ్లు విసరరని, లాఠీలు పట్టుకోరని, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించరని వ్యాఖ్యానించారు. 118 మంది పోలీసులకు తీవ్ర గాయాలు కావడం పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా మారిందో చెబుతోందని పేర్కొన్నారు. లాఠీచార్జ్ అనివార్య పరిస్థితుల్లోనే జరిగిందని స్పష్టం చేశారు.

నీట్‌పై చర్యలు తీసుకున్నాం

నీట్ పేపర్ లీక్ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశమని బండి సంజయ్ చెప్పారు. ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత తీవ్రంగా స్పందించారని వివరించారు. నిందితులకు వేగంగా శిక్ష పడేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేశామని, సీబీఐ ఇప్పటికే 17 మందిని అరెస్ట్ చేసిందని వెల్లడించారు. విద్యా సంవత్సరం నష్టపోకుండా 40 రోజుల్లోనే మళ్లీ పరీక్ష నిర్వహించి ఫలితాలు ప్రకటించామని గుర్తు చేశారు. దేశంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగా పాకిస్థాన్‌కు చెందిన 480 సోషల్ మీడియా ఖాతాలను కేంద్రం బ్లాక్ చేసిందని తెలిపారు.

విపక్షాల రాజకీయాలు

పార్లమెంట్‌లో చర్చకు రాకుండా బయట ఆందోళనలతో రాజకీయ లబ్ధి పొందాలనేదే విపక్షాల లక్ష్యమని బండి సంజయ్ విమర్శించారు. నీట్ సమస్యను పరిష్కరించడం కంటే ప్రధాని మోదీపై ఒత్తిడి పెంచడమే వారి ప్రధాన ఉద్దేశమని ఆరోపించారు. ప్రధాని, హోం మంత్రి, విద్యాశాఖ మంత్రుల రాజీనామాలు కోరుతున్న విపక్షాలు గతంలో తమ పాలిత రాష్ట్రాల్లో జరిగిన పేపర్ లీక్ ఘటనలపై ఎందుకు అదే ప్రమాణాలు పాటించలేదని ప్రశ్నించారు. పంజాబ్, కర్నాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళలో జరిగిన పరీక్షల అవకతవకల సమయంలో ముఖ్యమంత్రులు, మంత్రులు రాజీనామా చేశారా అని నిలదీశారు.

బీఆర్ఎస్‌పై ఘాటు విమర్శలు

తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో పేపర్ లీక్‌లు వరుసగా జరిగాయని బండి సంజయ్ ఆరోపించారు. ఎంసెట్, టీఎస్పీఎస్సీ గ్రూప్-1, ఎస్‌ఎస్‌సీ తెలుగు, హిందీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీకైన ఘటనలను గుర్తు చేశారు. ఆ సమయంలో కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. గ్రూప్-1 పేపర్ లీక్‌పై తాను పోరాడితే తనపైనే కేసులు పెట్టి జైలుకు పంపించారని అన్నారు. ఇప్పుడు అదే నాయకులు పేపర్ లీక్ పేరుతో ధర్నాలు చేయడం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. కేటీఆర్‌పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, గత ఘటనలపై సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనల్లో నిజమైన విద్యార్థుల భావోద్వేగాలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవద్దని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.