Home Telangana నేతన్న సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ నిర్వహణ

నేతన్న సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ నిర్వహణ


జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా వేడుకలు నిర్వహించింది. రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కార్యక్రమంలో పాల్గొని చేనేత వస్త్ర ప్రదర్శనను ప్రారంభించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత పురస్కార గ్రహీతలను ఘనంగా సత్కరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చేనేత కళాకారులు ఏర్పాటు చేసిన 100కు పైగా స్టాల్స్‌ను సందర్శించి వారి ప్రతిభను అభినందించారు. ఆగస్టు 7 నుంచి 16 వరకు కొనసాగే ఈ ప్రదర్శనను ప్రజలు సందర్శించి చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి నేతన్నలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

రైతన్నకు.. నేతన్నకు సమాన ప్రాధాన్యం

రైతుకు అన్నం పండించే బాధ్యత ఉంటే, నేతన్నకు దేశానికి వస్త్రం అందించే బాధ్యత ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ రెండు రంగాలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని చెప్పారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో వ్యవసాయ రంగ పునరుద్ధరణతో పాటు చేనేత రంగాన్ని కూడా బలోపేతం చేసే చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. చేనేత కేవలం ఉపాధి మాత్రమే కాదని, భారతీయ సంస్కృతి, సంప్రదాయం, వారసత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు.

ప్రపంచ గుర్తింపు తెచ్చిన తెలంగాణ చేనేత

తెలంగాణ చేనేత ఉత్పత్తులు దేశ విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించాయని మంత్రి తెలిపారు. గద్వాల చీరలు, పోచంపల్లి ఇక్కత్, నారాయణపేట వస్త్రాలు, సిద్దిపేట గొల్లభామ చీరలు, వరంగల్ దర్రీస్, కరీంనగర్ బెడ్‌షీట్లు రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చాయని వివరించారు. సంప్రదాయ కళను ఆధునిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతూ చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు. చేనేత కార్మికుల జియో ట్యాగింగ్‌లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని వెల్లడించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ద్వారా యువతకు ఆధునిక శిక్షణ అందిస్తున్నామని వివరించారు.

సంక్షేమ పథకాలతో భారీ ఆర్థిక మద్దతు

చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మంత్రి వివరించారు. నేతన్న పొదుపు పథకం అమలుతో పాటు నేతన్నకు భద్రత పథకం ద్వారా మరణించిన కార్మికుడి కుటుంబానికి రూ.5 లక్షల బీమా సాయం అందిస్తున్నామని తెలిపారు. చేనేత రుణమాఫీ కోసం రూ.49.27 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. నేతన్న భరోసా పథకం కింద కార్మికులకు ఏడాదికి రూ.18 వేల చొప్పున, అనుబంధ కార్మికులకు రూ.6 వేల చొప్పున సాయం అందించేందుకు రూ.15 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. నేతన్నకు చేయూత కోసం రూ.304 కోట్లు, మరమగ్గ కార్మికుల సంక్షేమానికి రూ.44 కోట్లు, నేతన్న భద్రతకు రూ.20 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు.

చేనేత పునరుజ్జీవనమే ప్రభుత్వ లక్ష్యం

వేములవాడలో రూ.50 కోట్లతో ఏర్పాటు చేసిన యార్న్ డిపో ద్వారా ఇప్పటికే 3,096 మెట్రిక్ టన్నుల నూలును మాక్స్ సంఘాలకు క్రెడిట్ విధానంలో సరఫరా చేసినట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న రూ.500 కోట్లతో కలిపి మొత్తం రూ.980 కోట్లు విడుదల చేసి చేనేత రంగానికి ఊతమిచ్చామని చెప్పారు. పదేళ్లుగా నిలిచిపోయిన చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్య వ్యవస్థను పునరుద్ధరించామని వెల్లడించారు. చేనేత కార్మికుల సంక్షేమం, మార్కెటింగ్, ఆధునికీకరణ, సామాజిక భద్రతకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు.

 

#TelanganaHandloom #NationalHandloomDay #HandloomDay2026 #TelanganaWeavers #WeaverWelfare #ThummalaNageswaraRao #RevanthReddy #HandloomExhibition #PochampallyIkat #GadwalSarees #NarayanpetTextiles #SiddipetGollabhama #NethannaBharosa #NethannaBima #HandloomSector #TelanganaGovernment #WeaverWelfareSchemes #IndianHandlooms