Home Telangana జల్సాల కోసం ప్రిన్సిపల్ హత్య డబ్బు కోసం విద్యార్థుల దారుణం

జల్సాల కోసం ప్రిన్సిపల్ హత్య డబ్బు కోసం విద్యార్థుల దారుణం



నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో కీలక విషయాలను ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. జల్సాలకు అలవాటుపడిన ఇద్దరు విద్యార్థులు డబ్బు కోసం ఈ హత్యకు పాల్పడ్డారని తెలిపారు. స్కూల్ ఫీజుల వసూళ్లు జరుగుతున్న సమయంలో ప్రిన్సిపల్ ఇంట్లో నగదు ఉంటుందని భావించిన విద్యార్థులు ఐదు రోజుల ముందే దొంగతనానికి ప్లాన్ చేశారు. ఈ నెల 11న స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి ఆమె ఇంటికి వెళ్లారు. ఒక విద్యార్థి మాస్క్ ధరించి గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించాడు. అయితే మాస్క్ ఊడిపోవడంతో ప్రిన్సిపల్ అతడిని గుర్తుపట్టారు. దీంతో ఆమెను కత్తితో 27 సార్లు పొడిచి హత్య చేసినట్లు ఎస్పీ తెలిపారు. అనంతరం ఇంట్లోని నగదుతో పాటు రూపారెడ్డి మొబైల్‌ను తీసుకుని ఇద్దరూ పరారయ్యారు.

జల్సాలు చేసిన విద్యార్థులపై అనుమానం

కేసు దర్యాప్తు కోసం ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సుమారు 70 సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుల కదలికలను గుర్తించారు. హత్య తర్వాత నాలుగు రోజుల పాటు స్కూల్‌కు సెలవులు ఇచ్చారు. తిరిగి స్కూల్ తెరిచిన తర్వాత గైర్హాజరైన 13 మంది విద్యార్థులపై పోలీసులు ఆరా తీశారు. వారిలో ఐదుగురు పదో తరగతి విద్యార్థులు ఉండగా, ఇద్దరు అకస్మాత్తుగా డబ్బు ఖర్చు చేస్తూ జల్సాలు చేస్తున్నట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒకరి వద్ద రూ.1.54 లక్షల నగదు, ఐఫోన్ లభించాయి. నగదుపై రక్తపు మరకలు ఉండటంతో పరీక్షలకు పంపగా అవి మనిషి రక్తమని తేలింది. నిందితుల్లో ఒకరు గతంలో స్కూల్ హాస్టల్‌లో ఉండేవాడు. అతడి బ్యాగులో డబ్బు, మొబైల్ లభించడంతో రూపారెడ్డి మందలించి డేస్కాలర్‌గా మార్చారు. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులకు మైనర్లు కావడంతో జువైనల్ జస్టిస్ బోర్డుకు పంపనున్నట్లు ఎస్పీ తెలిపారు.

 

#RoopaReddyMurder #Nalgonda #Kondamallepally #NagarjunaSchool #PrincipalMurder #StudentCrime #TelanganaCrime #MurderCase #PoliceInvestigation #MinorAccused #JuvenileCrime #TelanganaNews #CrimeNews #BreakingNews