Home Telangana ప్రజల గుండెల్లో కేసీఆర్ పథకాలే గుర్తు చేస్తున్నాయన్న కేటీఆర్

ప్రజల గుండెల్లో కేసీఆర్ పథకాలే గుర్తు చేస్తున్నాయన్న కేటీఆర్

కేసీఆర్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించే వారికి ప్రజలే సమాధానం చెబుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి నుంచి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గణేశ్ పండుగ సందర్భంగా గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడికి వెళ్లినా “దేఖ్ లేంగే.. కేసీఆర్” అనే మాట వినిపిస్తోందని పేర్కొన్నారు. మూడేళ్లుగా కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉన్నా ప్రజల గుండెల్లో ఆయనకు స్థానం చెక్కుచెదరలేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

పెన్షన్, నీటిలో కేసీఆర్ గుర్తు
రాష్ట్రంలో 46 లక్షల మంది పింఛన్‌దారులు కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. గతంలో రూ.200గా ఉన్న పింఛన్‌ను రూ.2 వేలకు పెంచిన ఘనత కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. ఇంటింటికీ నల్లా నీరు అందించిన మిషన్ భగీరథను ప్రస్తావిస్తూ.. నీటి బొట్టులో కూడా కేసీఆర్ కనిపిస్తున్నారని అన్నారు. గతంలో బిందెలతో నీటి కోసం ఇబ్బందులు పడిన మహిళలకు ఆ పరిస్థితి తప్పిందని వ్యాఖ్యానించారు. కళ్యాణ లక్ష్మి ద్వారా ఆడపిల్లల వివాహానికి ఆర్థిక సాయం అందిన ప్రతిసారి తల్లిదండ్రులు కేసీఆర్‌ను మేనమామలా గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు. కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను తీసుకొచ్చిన విషయాన్ని రైతులు గుర్తు చేసుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.

రైతుబంధుపై కాంగ్రెస్‌పై విమర్శలు
రైతుబంధు నిధుల విషయంలోనూ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కేసీఆర్ హయాంలో నాట్ల సమయానికి రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమయ్యేవని, ఇప్పుడు నిధుల కోసం రైతులు ఎదురుచూడాల్సి వస్తోందని ఆరోపించారు. ఎకరాకు సాయం అందించిన ప్రతిసారీ కాంగ్రెస్ ప్రభుత్వం సమావేశాలు నిర్వహిస్తూ గొప్పగా ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. ప్రజలకు నేరుగా ఉపయోగపడే పనుల కంటే కేసీఆర్‌ను విమర్శించడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.

 

#KTR #KCR #BRS #KTR #KCRLegacy #TelanganaPolitics #KCRWelfareSchemes #MissionBhagiratha #KalyanaLakshmi #RythuBandhu #Kaleshwaram #AasaraPensions #BRSNews #CongressVsBRS #TelanganaNews