Home Telangana కేసీఆర్‌ చాలా మంచోడు కొండా సురేఖ ప్రశంసలు బీఆర్‌ఎస్‌ వైపు అడుగులు?

కేసీఆర్‌ చాలా మంచోడు కొండా సురేఖ ప్రశంసలు బీఆర్‌ఎస్‌ వైపు అడుగులు?

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన కొండా సురేఖ.. వరుస ఇంటర్వ్యూల్లో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఓ ప్రముఖ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించడం తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. గతంలో బీఆర్‌ఎస్‌లో పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్న సురేఖ.. కేసీఆర్‌ చాలా మంచి వ్యక్తి అని చెప్పారు. తమను కలిసిన ప్రతిసారీ చాలా గౌరవంగా, హుందాగా రిసీవ్‌ చేసుకునేవారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌లో ఉన్న సమయంలో కేసీఆర్‌తో తమకు ఎలాంటి విభేదాలు రాలేదని స్పష్టం చేశారు. తమ కుటుంబం కోరిన వెంటనే కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ సమయంలో మురళికి ఎమ్మెల్సీ పదవి దక్కకుండా కడియం శ్రీహరి సహా కొందరు సీనియర్‌ నేతలు అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. కేసీఆర్‌ స్వయంగా జోక్యం చేసుకుని ఇతరుల నామినేషన్లు ఉపసంహరింపజేసి మురళిని ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా గెలిపించారని సురేఖ వెల్లడించారు.

కాంగ్రెస్‌పై అసంతృప్తి.. బీఆర్‌ఎస్‌పై ఆసక్తి?

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కొండా సురేఖ.. మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ అయిన తర్వాత కేసీఆర్‌ పాలన, వ్యక్తిత్వాన్ని ప్రశంసించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గత అనుభవాలను గుర్తుచేసుకుంటూ కేసీఆర్‌ను సానుకూలంగా ప్రస్తావించడం వెనుక రాజకీయ వ్యూహం ఉందా? అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా కాంగ్రెస్‌లో కొండా సురేఖకు ఎదురైన పరిణామాల నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కేసీఆర్‌తో గతంలో తనకు ఉన్న అనుబంధాన్ని ఆమె బహిరంగంగా ప్రస్తావించడంతో.. కొండా సురేఖ, కొండా మురళి దంపతులు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరతారా? అనే ప్రచారం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. అయితే ఇప్పటివరకు బీఆర్‌ఎస్‌లో చేరికపై కొండా దంపతుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో సురేఖ వ్యాఖ్యలు కేవలం గత అనుభవాలపై ప్రశంసలేనా.. లేక రాజకీయంగా కొత్త అడుగుకు సంకేతమా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

 

#KondaSurekha #KCR #KondaMurali #BRS #TelanganaPolitics #Congress #KondaSurekhaKCR #KCRPraise #TelanganaCongress #KondaCouple #BRSPolitics #TelanganaNews