7 లక్షల కుటుంబాలకు ఊరట.
పేదల సొంతింటి హక్కుకు భరోసా.
కలెక్టర్లకు మంత్రి పొంగులేటి ఆదేశాలు.
2014కు ముందు ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల కింద ఇళ్లు నిర్మించుకున్న పేదలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇందిరమ్మతో పాటు అప్పట్లో అమలైన వివిధ గృహ నిర్మాణ పథకాల లబ్ధిదారులకు గతంలో జారీ చేసిన ఇంటి పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లను తిరిగి అందించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ చర్యతో సుమారు 7 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలగనుంది. దశాబ్దానికి పైగా తమ ఇంటి పత్రాల కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు ఈ నిర్ణయం ఊరటనివ్వనుందని మంత్రి పేర్కొన్నారు.
కలెక్టర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు
లబ్ధిదారుల ఇంటి పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లు తిరిగి అందించేలా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు పొంగులేటి తెలిపారు. 22ఏ భూములపై సమీక్ష జరుగుతున్న సమయంలో తహసీల్దార్ కార్యాలయాల్లో లబ్ధిదారులకు సంబంధించిన పట్టాలు భారీ సంఖ్యలో ఉన్న విషయం ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. వెంటనే వాటిని పేదలకు తిరిగి ఇవ్వాలని ఆయన ఆదేశించడంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. గతంలో పట్టాలు తిరిగి అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న లబ్ధిదారుల నుంచి ముఖ్యమంత్రి, తనకు అనేక విజ్ఞప్తులు అందాయని మంత్రి వివరించారు. ప్రభుత్వం వద్ద ఉన్న పత్రాలను గుర్తించి అర్హులైన వారికి అందించాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు.
రుణాలు చెల్లించినా పత్రాలు అందని పరిస్థితి
2014కు ముందు అమలైన గృహ నిర్మాణ పథకాలలో ప్రభుత్వ సబ్సిడీతో పాటు లబ్ధిదారుల వాటా, బ్యాంకు రుణం ద్వారా ఆర్థిక సాయం అందించేవారు. రుణాలకు భద్రతగా లబ్ధిదారుల ఇంటి పట్టాలను బ్యాంకులు తనఖాగా ఉంచుకునేవి. రుణ వాయిదాలన్నీ చెల్లించిన తర్వాత ఆ పత్రాలను తిరిగి ఇవ్వాల్సి ఉండేది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇందిరమ్మ పథకం నిలిచిపోవడంతో కొందరికి పట్టాలు తిరిగి అందలేదు. వివిధ కారణాలతో ప్రభుత్వ కార్యాలయాల్లోనే మిగిలిపోయిన ఈ పత్రాలను ఇప్పుడు లబ్ధిదారులకు అప్పగించాలని నిర్ణయించారు. సొంతింటిపై హక్కును మరింత భద్రం చేసే ఈ నిర్ణయం లక్షలాది పేద కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చనుంది.
#Telangana #HousingScheme #HousePattas #IndirammaHousing #PonguletiSrinivasaReddy #RevanthReddy #7LakhBeneficiaries #PossessionCertificates #PoorFamilies #HouseOwnershipRights











