పల్నాడు ప్రాజెక్టుపై ఎందుకు మౌనం?
కేఆర్ఎంబీ మినిట్స్‌తో రాజకీయ దుమారం.
సాగర్ జలాలపై రేవంత్‌కు హరీశ్ ప్రశ్నలు!
నాగార్జునసాగర్ జలాల వినియోగంపై కేఆర్ఎంబీ మూడు సభ్యుల కమిటీ సమావేశం మినిట్స్‌ను ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ప్రతిపాదించినట్లు చెబుతున్న పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి, ఏపీ ప్రతిపాదనలపై గట్టిగా మాట్లాడలేదని ఆరోపించారు. గతంలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో గోదావరి జలాల తరలింపునకు సంబంధించిన బనకచర్ల ప్రాజెక్టుపై ప్రశ్నించలేదని, ఇప్పుడు కృష్ణా జలాల విషయంలోనూ అదే వైఖరి కొనసాగుతోందని విమర్శించారు.
కేఆర్ఎంబీ మినిట్స్‌లో ఏముంది?
నవంబర్ 23న జరిగిన సమావేశంలో నాగార్జునసాగర్‌లో 45.40 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నట్లు మినిట్స్ వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ వినియోగం 17.207 టీఎంసీలు, తెలంగాణ వినియోగం 47.177 టీఎంసీలుగా పేర్కొన్నారు. కృష్ణా డెల్టా వ్యవస్థకు 6 టీఎంసీలు కేటాయించాలని ఏపీ ఇంజినీరింగ్ అధికారి ప్రతిపాదించగా, తెలంగాణ అధికారి మాత్రం ఆ అవసరానికి సున్నా టీఎంసీలు కేటాయించాలని సూచించారు. కుడి, ఎడమ కాలువల ద్వారా నీటి పంపిణీపై కూడా ఇరు రాష్ట్రాల అధికారులు భిన్న ప్రతిపాదనలు చేశారు. కృష్ణా డెల్టా నీటి అంశంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో బోర్డు సమావేశం నిర్వహించాలని కమిటీ సూచించింది. అయితే మినిట్స్‌లో పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ప్రస్తావన లేదు.
తెలంగాణ హక్కులపై హరీశ్‌రావు నిలదీత
పల్నాడు ప్రాజెక్టుపై సమావేశంలో చర్చించామని ప్రచారం చేసినవారు, మినిట్స్‌లో ఆ ప్రస్తావన లేకపోవడంపై సమాధానం చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. నాడు బనకచర్ల.. నేడు పల్నాడు అంటూ రేవంత్‌రెడ్డి వైఖరిని తప్పుబట్టారు. తెలంగాణ నీటి హక్కులను పణంగా పెడుతున్నారని ఆరోపిస్తూ, ఏపీ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు చేశారు. ఈ వ్యవహారంపై తెలంగాణ మేధావులు, ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. నీటి పంపిణీపై ఇరు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం తన అభ్యంతరాలను స్పష్టంగా వెల్లడించాలన్నది హరీశ్‌రావు ప్రధాన డిమాండ్.
#HarishRao #RevanthReddy #PalnaduWaterGrid #BanakacherlaProject #KRMB #NagarjunaSagar #KrishnaRiver #TelanganaWaterRights #WaterDispute











