Home AP ప్యాకేజ్డ్‌ ఫుడ్‌పై రెడ్ వార్నింగ్!

ప్యాకేజ్డ్‌ ఫుడ్‌పై రెడ్ వార్నింగ్!

అనారోగ్య ఆహారానికి సుప్రీం చెక్‌..
చక్కెర, ఉప్పు, కొవ్వుపై ఎర్ర గుర్తులు!
4 నెలల్లో కొత్త లేబులింగ్‌ నిబంధనలు!

ప్యాకేజ్డ్‌ ఆహార పదార్థాలపై పోషక విలువలను స్పష్టంగా తెలియజేసేలా కొత్త హెచ్చరికల విధానాన్ని తీసుకురావాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అధిక చక్కెర, సంతృప్త కొవ్వు, ఉప్పు కలిగిన ఆహార ఉత్పత్తుల ప్యాకెట్లపై ప్రత్యేక ఎరుపు రంగు హెచ్చరిక గుర్తులు తప్పనిసరి చేయాలని ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ)ను ఆదేశించింది. ఈ నిబంధనల ముసాయిదాను రూపొందించి నాలుగు నెలల్లో తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. కేరళకు చెందిన 3ఎస్‌ అండ్‌ అవర్‌ హెల్త్‌ సొసైటీ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ కే వినోద్‌ చంద్రన్‌ల ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. ముఖ్యంగా ‘యాడెడ్‌ షుగర్‌’కు బదులుగా మొత్తం చక్కెర స్థాయిని, ‘యాడెడ్‌ ఫ్యాట్‌’కు బదులుగా సంతృప్త కొవ్వు స్థాయిని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఉప్పును కూడా ప్రమాదకర పోషకాల జాబితాలో చేర్చింది.

ఒక్కో పోషకానికి ప్రత్యేక ఎర్ర షడ్భుజి!

కొత్త నిబంధనల ప్రకారం అధిక చక్కెర, కొవ్వు, ఉప్పు ఉన్న ఉత్పత్తులపై ఒక్కో పోషకానికి ప్రత్యేక ఎరుపు రంగు షడ్భుజి గుర్తు ఉండాలి. వాటిపై ‘హై షుగర్‌’, ‘హై ఫ్యాట్‌’, ‘హై సాల్ట్‌’ అనే పదాలు స్పష్టంగా ముద్రించాలని ధర్మాసనం ఆదేశించింది. ప్యాకెట్‌ ప్రధాన ప్రదర్శన భాగంలో ప్రతి గుర్తుకు కనీసం 4 నుంచి 5 శాతం స్థలం కేటాయించాలని సూచించింది. వినియోగదారులు కొనుగోలు సమయంలోనే సులభంగా చదివేలా అక్షరాల పరిమాణం ఉండాలని పేర్కొంది. హెచ్చరికలకు నిర్ణయించే పరిమితులు మరీ ఎక్కువగా ఉంటే అనారోగ్యకర ఉత్పత్తులు తప్పించుకుంటాయని, మరీ తక్కువగా ఉంటే దాదాపు అన్ని ప్యాకెట్లపై హెచ్చరికలు కనిపించి ప్రజలు వాటిని పట్టించుకోకపోవచ్చని హెచ్చరించింది. విదేశాల్లో ఒక ప్రమాణం, భారత్‌లో మరో ప్రమాణం పాటించే బహుళజాతి ఆహార సంస్థల తీరును కూడా తప్పుబట్టింది. భారతీయ వినియోగదారులకు అమెరికా, బ్రిటన్‌ వినియోగదారులతో సమానమైన ఆరోగ్య రక్షణ, సమాచార హక్కు కల్పించాలని స్పష్టం చేసింది.

ఏడాది గడువు.. దుర్వినియోగానికి అడ్డుకట్ట!

కొత్త నిబంధనల ముసాయిదాపై దేశీయ సంస్థల నుంచి 60 రోజుల పాటు అభిప్రాయాలు సేకరించి, ప్రపంచ వాణిజ్య సంస్థ వేదికపైనా సంప్రదింపులు జరపాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వెల్లడించింది. అనంతరం తుది నిబంధనలను ఆమోదించి కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. అమలుకు ఆహార తయారీ సంస్థలకు 365 రోజుల గడువు ఇచ్చే ప్రతిపాదనను కోర్టు అంగీకరించినప్పటికీ, ఈ సమయంలో పాత లేబుళ్లతో అధికంగా ఉత్పత్తులు తయారుచేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పటికే తయారైన హెచ్చరికలు లేని ఉత్పత్తులను మార్కెట్‌ నుంచి ఎలా తొలగించాలో స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని సూచించింది. మరోవైపు పాఠశాలల్లో చిన్నప్పటి నుంచే పోషకాహారంపై అవగాహన కల్పించాలని కేంద్రానికి ఆదేశించింది. 2020లో రూపొందించిన పాఠశాలల ఆహార భద్రత నిబంధనలను సమర్థంగా అమలు చేయాలని, విద్యార్థులకు వర్క్‌షాప్‌లు, ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు నేర్పించాలని పేర్కొంది. ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చి నిబంధనలను సకాలంలో అమలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

 

#SupremeCourt #FSSAI #PackagedFood #FoodWarningLabels #RedWarningLabels #HighSugar #HighFat #HighSalt #FoodSafety #NutritionAwareness