Home Telangana డ్రగ్స్‌పై జనయుద్ధం వెంకటేశ్ పిలుపు.. నిఖిల్ సంఘీభావం

డ్రగ్స్‌పై జనయుద్ధం వెంకటేశ్ పిలుపు.. నిఖిల్ సంఘీభావం

కిషన్ రెడ్డి పాదయాత్రకు సినీ తారల మద్దతు!
నషాముక్త భారత్ కోసం 13 కిలోమీటర్ల పాదయాత్ర.

డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టి యువతకు భద్రమైన భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి చేపట్టిన మూడు రోజుల ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషాముక్త భారత్’ పాదయాత్ర మొదటిరోజు విజయవంతమైంది. బుధవారం అంబర్‌పేట మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ప్రారంభమైన ఈ యాత్రకు సినీ నటుడు విక్టరీ వెంకటేశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జాతీయ జెండా చేతబూని విద్యార్థులతో కలిసి యాత్రను ప్రారంభించారు. అనంతరం సినీ నటుడు నిఖిల్ కూడా కిషన్ రెడ్డితో కలిసి పాదయాత్రలో పాల్గొని డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి మద్దతు ప్రకటించారు. విద్యార్థులు, యువత, వైద్య విద్యార్థులు, అధ్యాపకులు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు, స్వామీజీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంబర్‌పేట్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ, ఇఫ్లూ, సీతాఫల్‌మండి, చిలకలగూడ, గాంధీ ఆస్పత్రి మీదుగా సుమారు 13 కిలోమీటర్లు సాగిన యాత్ర ముషీరాబాద్‌లో ముగిసింది.

వెంకటేశ్ పిలుపు.. జీవితానికి ఎస్ చెప్పండి!

ప్రారంభోత్సవంలో వెంకటేశ్ మాట్లాడుతూ.. “డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి” అని యువతకు పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు యువతే అతిపెద్ద బలమని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. డ్రగ్స్‌కు బానిసైన వారిని దూరం పెట్టకుండా, వారికి అండగా నిలిచి వ్యసనం నుంచి బయటపడేలా సహాయం చేయాలని కోరారు. 2029 నాటికి డ్రగ్స్ రహిత భారత్ సాధించే లక్ష్యానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు నిఖిల్ పాదయాత్రలో పాల్గొని తన సంఘీభావాన్ని ప్రకటించారు. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచే ఈ సామాజిక ఉద్యమానికి సినీ ప్రముఖుల మద్దతు కార్యక్రమానికి మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది.

విద్యార్థుల ప్రతిజ్ఞ.. ప్రజల నీరాజనం

కిషన్ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ మాఫియాను కూకటివేళ్లతో నిర్మూలించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాజకీయాలు, కులాలు, మతాలకు అతీతంగా ప్రజలంతా ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఉస్మానియా, ఇఫ్లూ విద్యార్థులు, అధ్యాపకులు డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు. పలువురు వైస్ ఛాన్సలర్లు, స్వామీజీలు యాత్రకు మద్దతు తెలిపారు. మహిళలు, స్థానికులు రోడ్డుకు ఇరువైపులా స్వాగతం పలికారు. గురువారం రెండో రోజు యాత్ర ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్‌నగర్, హిమాయత్‌నగర్, లిబర్టీ, ఖైరతాబాద్, పంజాగుట్ట మీదుగా సత్యం థియేటర్ వరకు కొనసాగనుంది. మొత్తంగా డ్రగ్స్ వ్యతిరేక పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మార్చడంలో తొలిరోజు కార్యక్రమం విజయవంతమైన అడుగుగా నిలిచింది.

 

#KishanReddy #Venkatesh #NikhilSiddhartha #NashaMuktBharat #DrugFreeIndia #AntiDrugCampaign #HyderabadWalkathon #SayNoToDrugs #YouthAgainstDrugs