Home Telangana గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా విడుదల!

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా విడుదల!

12.69 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తి.
11.89 లక్షల మందికి ఓటు హక్కు ఆమోదం.

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారులు నవంబర్ 25న విడుదల చేశారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొత్త ఓటర్ల నమోదు కోసం స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి ఈ జాబితాను ప్రకటించారు. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ నియోజకవర్గంలో 5,99,419 దరఖాస్తులు అందగా, వీటిలో 5,68,105 ఆమోదించారు. సరైన పత్రాలు లేకపోవడం, నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాలతో 31,314 దరఖాస్తులను తిరస్కరించారు. ఈ నియోజకవర్గ పరిధిలోని 156 మండలాల్లో జాబితా ప్రక్రియ పూర్తయింది. మరోవైపు వరంగల్–ఖమ్మం–నల్గొండ నియోజకవర్గంలో 6,70,407 దరఖాస్తులు రాగా, 6,21,086 ఆమోదం పొందాయి. మిగిలిన 49,321 దరఖాస్తులను తిరస్కరించారు. ఈ నియోజకవర్గ పరిధిలోని 192 మండలాల్లోనూ ముసాయిదా జాబితా విడుదలైంది.

డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలకు అవకాశం

రెండు నియోజకవర్గాలను కలిపి మొత్తం 12,69,826 దరఖాస్తులు అందగా, 11,89,191 దరఖాస్తులకు ఆమోదం లభించింది. మరో 80,635 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ముసాయిదా జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో పట్టభద్రులు తప్పనిసరిగా పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. పేర్లు నమోదు కాకపోయినా, జాబితాలో ఏవైనా తప్పులు ఉన్నా అభ్యంతరాలు తెలియజేయవచ్చని స్పష్టం చేశారు. ఇందుకోసం డిసెంబర్ 10వ తేదీ వరకు ఫామ్-18 ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అందిన అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించిన అనంతరం డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే పట్టభద్రులు గడువులోగా తమ వివరాలను సరిచూసుకోవడం కీలకంగా మారింది.

 

#TelanganaMLC #GraduateMLC #VoterList #TelanganaElections #GraduateVoters #Form18 #MahabubnagarRangareddyHyderabad #WarangalKhammamNalgonda