ఇందిరమ్మ టవర్స్‌కు హెల్ప్‌లైన్ ప్రారంభం.
తప్పుడు ప్రచారం జరుగుతోందన్న పొంగులేటి.
రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద ఉన్న అధికారిక గణాంకాలే దీనికి నిదర్శనమని చెప్పారు. ప్రజలు తప్పుడు ప్రచారాన్ని నమ్మాల్సిన అవసరం లేదని సూచించారు.
40 శాతం పెరిగిన ఫ్లాట్ల విక్రయాలు
గత రెండున్నరేళ్ల ప్రజా ప్రభుత్వ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం 15 నుంచి 20 శాతం వరకు అభివృద్ధి చెందిందని మంత్రి తెలిపారు. ఫ్లాట్ల విక్రయాలు దాదాపు 40 శాతం పెరిగాయని వెల్లడించారు. గత పదేళ్లతో పోలిస్తే ఈ రెండున్నరేళ్లలో రెసిడెన్షియల్ మార్కెట్ గణనీయంగా విస్తరించిందన్నారు. రిజిస్ట్రేషన్ పత్రాల సంఖ్య పెరగడమే దీనికి స్పష్టమైన ఆధారమని వివరించారు.
మూసీ ప్రాజెక్ట్‌కు త్వరలో టెండర్లు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టితో హైదరాబాద్ అభివృద్ధికి భారీ ప్రణాళికలు అమలు చేస్తున్నామని పొంగులేటి తెలిపారు. రూ.7 వేల కోట్లతో చేపడుతున్న మూసీ సుందరీకరణ తొలి దశ 28 కిలోమీటర్ల పనులకు వారం, పది రోజుల్లో టెండర్లు పిలవనున్నట్లు చెప్పారు. రెండో దశలో రూ.24 వేల కోట్లతో 76 కిలోమీటర్ల మెట్రో విస్తరణ చేపడతామని వెల్లడించారు. త్రిబుల్ ఆర్ నుంచి ఓఆర్ఆర్ వరకు రేడియల్ రోడ్ల నిర్మాణ ప్రతిపాదనలు కూడా సిద్ధమవుతున్నాయని పేర్కొన్నారు.
భూభారతి చట్టంతో భూములకు భరోసా
ప్రజల భూములకు పూర్తి రక్షణ కల్పించడమే లక్ష్యంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. సాఫ్ట్‌వేర్‌లో ఉన్న చిన్న సమస్యలను 15 నుంచి 20 రోజుల్లో పరిష్కరించి సేవలను మరింత సులభతరం చేస్తామని చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగ ప్రతినిధులు సమయానికి ఫ్లాట్లు అందించి వినియోగదారుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు.
ఇందిరమ్మ టవర్స్‌కు హెల్ప్‌లైన్
ఇందిరమ్మ టవర్స్ పథకంపై ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికి ప్రత్యేక కాల్ సెంటర్ హెల్ప్‌లైన్ 040-24603572ను మంత్రి ప్రారంభించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో సమాచారం అందుబాటులో ఉంటుందని తెలిపారు. మధ్యవర్తులను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే తీసుకోవాలని ప్రజలకు సూచించారు.
ఆధార్ చాలు.. యూపీఐతోనే చెల్లింపు
దరఖాస్తు సమయంలో ఆధార్ నంబర్ ఒక్కటే సరిపోతుందని మంత్రి వెల్లడించారు. ఇతర ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. రూ.10 వేల ఈఎండీని యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారానే చెల్లించాలని సూచించారు. ఫ్లాట్ రాకపోతే అదే ఖాతాకు మొత్తం తిరిగి జమ అవుతుందని హామీ ఇచ్చారు. క్యూర్ పరిధిలో పదేళ్లుగా నివసిస్తున్న, వార్షిక ఆదాయం రూ.6 లక్షల లోపు ఉన్న కుటుంబాలు అర్హులని తెలిపారు.
మొదటి విడతలో 7,680 ఇళ్లు
మొదటి విడతలో 16 నియోజకవర్గాల్లో 7,680 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. మొత్తం లక్ష ఇళ్ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఒక్కో ఫ్లాట్ సుమారు 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడుతుందని వివరించారు. ఫ్లాట్ విలువ రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల మధ్య ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీతో పాటు 20 నుంచి 25 గజాల అన్‌డివైడెడ్ షేర్‌ను లబ్ధిదారుడి పేరుపై నమోదు చేస్తుందని చెప్పారు. లబ్ధిదారుడు కేవలం రూ.6 లక్షలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
#PonguletiSrinivasReddy #IndirammaTowers #TelanganaRealEstate #HyderabadRealEstate #RealEstateGrowth #IndirammaHousing #MoosiProject #BhuBharati #TelanganaGovernment #HyderabadDevelopment











