Home Telangana ఖరీదైన ప్రాంతాల్లో ఇందిరమ్మ టవర్స్‌

ఖరీదైన ప్రాంతాల్లో ఇందిరమ్మ టవర్స్‌

రాయదుర్గంలో పేదల సొంతింటికి శ్రీకారం.
ప్రతి నియోజకవర్గంలో లక్ష ఇళ్లు నిర్మాణం.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి .

హైదరాబాద్‌ శేరిలింగంపల్లి నియోజకవర్గం రాయదుర్గంలోని మల్కం చెరువు సమీపంలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌ నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. నగరానికి దూరంగా కాకుండా పేదలు తాము నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే సొంత ఇళ్లు పొందాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు మంత్రి తెలిపారు. రాయదుర్గంలోని సుమారు 2.85 ఎకరాల్లో 480 ఫ్లాట్ల నిర్మాణం చేపడుతున్నారు. ఈ ప్రాంతంలో భూమి మార్కెట్‌ విలువ సుమారు రూ.752–767 కోట్ల వరకు ఉంటుందని హౌసింగ్‌ బోర్డు అధికారులు వెల్లడించారు. పేదవాడికి నాలుగు గోడలు మాత్రమే కాదు.. ఆత్మగౌరవంతో జీవించే చిరునామా ఇవ్వడమే లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

లాటరీతో లబ్ధిదారుల ఎంపిక

ఇందిరమ్మ టవర్స్‌ లబ్ధిదారుల ఎంపికలో పైరవీలకు, రాజకీయ జోక్యానికి తావులేదని పొంగులేటి స్పష్టం చేశారు. అర్హత ఆధారంగా లాటరీ విధానంలో ఎంపిక చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ హౌసింగ్‌ బోర్డు కూడా ఎంపిక వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచి అభ్యంతరాల స్వీకరణకు అవకాశం కల్పిస్తోంది. లబ్ధిదారులకు ఫ్లాట్‌పై హక్కులతో పాటు ఉచిత రిజిస్ట్రేషన్‌ సౌకర్యం కల్పించే చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ఎంపికైన వారికి అలాట్‌మెంట్‌ లేఖలను ఎస్సెమ్మెస్‌, వాట్సాప్‌, హౌసింగ్‌ బోర్డు వెబ్‌సైట్‌ ద్వారా అందిస్తున్నారు. వచ్చే బోనాల నాటికి రాయదుర్గం టవర్స్‌ పనులు పూర్తి చేసి అక్కడి నుంచే బోనాలు ఎత్తేలా నిర్మాణాలను వేగవంతం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

దశలవారీగా మరిన్ని ఇళ్లు

హైదరాబాద్‌ నగర పరిధిలో ఇందిరమ్మ టవర్స్‌ ద్వారా పెద్ద సంఖ్యలో పేద కుటుంబాలకు ఇళ్లు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని పొంగులేటి తెలిపారు. మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గానికి 480 ఫ్లాట్ల చొప్పున నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి వెంటనే ఇల్లు రాకపోయినా నిరాశ చెందాల్సిన అవసరం లేదని, రెండో, మూడో విడతల్లోనూ నిర్మాణాలు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. నిర్మాణ నాణ్యతపై రాజీ ఉండదని, లబ్ధిదారులు పనులను స్వయంగా పరిశీలించి లోపాలు కనిపిస్తే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. పేదల పిల్లలు భవిష్యత్‌లో గర్వంగా చెప్పుకునే ఆస్తిగా ఈ ఇళ్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

 

#IndirammaTowers #IndirammaHouses #Raidurg #HyderabadHousing #PonguletiSrinivasaReddy #TelanganaHousingBoard #480Flats #AffordableHousing #HousingScheme #IndirammaHousing #MalkaCheruvu #LotterySelection #PoorFamilies #FreeRegistration #TelanganaGovernment