Home Telangana మూసీ ప్రక్షాళన ముసుగులో మెగా దోపిడీ?

మూసీ ప్రక్షాళన ముసుగులో మెగా దోపిడీ?

ప్రజాభిప్రాయ సేకరణపై బీఆర్ఎస్‌ అభ్యంతరాలు.

మూసీ ప్రాజెక్టుపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. మూసీ పునరుద్ధరణకు తాము వ్యతిరేకం కాదని, దాని పేరుతో పేదల ఇళ్లను తొలగించడం, భారీ వ్యయంతో ప్రాజెక్టు చేపట్టడాన్ని ప్రశ్నిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన తమను అడ్డుకుని అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని విమర్శించారు. సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం సుమారు రూ.25 వేల కోట్లతో మూసీ ప్రక్షాళనకు ప్రణాళిక రూపొందించిందని, బఫర్‌ జోన్‌లో ఉన్న పేదల ఇళ్లను కూల్చకుండా ప్రత్యామ్నాయంగా ఎలివేటెడ్‌ కారిడార్‌ను పరిశీలించిందని తెలిపారు. ఇప్పుడు ప్రాజెక్టు వ్యయం రూ.50 వేల కోట్ల నుంచి రూ.1.50 లక్షల కోట్లకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. 50 మీటర్ల బఫర్‌ జోన్‌ను 500 మీటర్లకు ఎందుకు పెంచారు? సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) లేకుండా టెండర్లు ఎలా పిలుస్తారు? అని నిలదీశారు.

కరువు వేళ కోట్ల ఖర్చు అవసరమా?

ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కరువు పరిస్థితులు, తాగునీరు, సాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్న సమయంలో మూసీ సుందరీకరణకు వేల కోట్లు ఖర్చు చేయడం ఏమిటని ప్రశ్నించారు. డీపీఆర్‌, సామాజిక, పర్యావరణ ప్రభావాల అంచనాలు లేకుండానే ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు ద్వారా రూ.7,345 కోట్ల రుణం తీసుకుని గ్లోబల్‌ టెండర్లు పిలవడం పారదర్శకతపై సందేహాలు కలిగిస్తోందని ఆరోపించారు. ప్రజాభిప్రాయ సేకరణను స్వేచ్ఛగా నిర్వహించకుండా స్థానిక ఎమ్మెల్యేను, బాధితులను అడ్డుకున్నారని విమర్శించారు. మల్లన్నసాగర్‌ నుంచి మూసీకి నీళ్లు తెస్తామని చెబుతున్న ప్రభుత్వం, ప్రజల తాగునీటి అవసరాలకు ఎలా భరోసా ఇస్తుందో వివరించాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, రైతు భరోసా, వృద్ధుల పింఛన్ల వంటి అంశాలపై దృష్టి పెట్టకుండా భారీ ప్రాజెక్టు చేపట్టడాన్ని తప్పుబట్టారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లకు నష్టం కలిగించే చర్యలను బీఆర్ఎస్‌ అడ్డుకుంటుందని, ప్రాజెక్టు పూర్తి వివరాలను ప్రజల ముందుంచి పారదర్శకంగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

 

#MusiRiverProject #MusiRejuvenation #BRS #SudheerReddy #DasojuSravan #RevanthReddy #TelanganaPolitics #MusiProjectCost #ProjectTransparency #DPR #AsianDevelopmentBank #GlobalTenders #BufferZone #PublicConsultation #HyderabadNews