ఆధార్ ఉంటే అప్లై చేయొచ్చు
అక్టోబర్ 5న డ్రా – మంత్రి కొల్లు
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 807 మద్యం దుకాణాలకు ప్రభుత్వం కొత్తగా దరఖాస్తులు ఆహ్వానించింది. అక్టోబర్ 1 అర్ధరాత్రి వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 3,736 ఏ4 దుకాణాల్లో 2,929 షాపులను ప్రస్తుత పాలసీలోనే రెన్యువల్ చేశారు. మిగిలిన వాటిలో 799 ఓపెన్ కేటగిరీ, 8 గౌడ సామాజిక వర్గానికి రిజర్వ్ చేశారు. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల రుసుముతో పాటు రూ.1,000 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చు. అక్టోబర్ 3న దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. అక్టోబర్ 5న ఉదయం 8 గంటల నుంచి కలెక్టర్ల పర్యవేక్షణలో ఆయా కలెక్టరేట్లలో లాటరీ ద్వారా షాపుల కేటాయింపు చేపడతారు.
ఆధార్‌తో దరఖాస్తు.. పారదర్శకతకు ప్రాధాన్యం
మద్యం షాపు లైసెన్స్‌కు ఆధార్ కార్డు ఉంటే ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత పాలసీలో 3,736 షాపులకు సుమారు 98 వేల దరఖాస్తులు వచ్చాయని, ఈసారి ఒక్కో షాపుకు కనీసం 10 దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎంపికైన వారు కేటాయింపు రోజున లైసెన్స్ ఫీజులో నాలుగో వంతు, పర్మిట్ రూమ్ ఫీజులో మూడో వంతు చెల్లించాలి. అనంతరం లైసెన్స్ జారీ చేసి స్టాక్ తీసుకునే అవకాశం కల్పిస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తు విధానాన్ని పారదర్శకత పెంచేందుకే అందుబాటులోకి తెచ్చామని అధికారులు తెలిపారు. ఎక్సైజ్ సురక్ష యాప్‌తో మద్యం బాటిల్‌ను స్కాన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని మంత్రి చెప్పారు. కల్తీ మద్యం తయారీపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, తక్కువ ఆల్కహాల్ ఉన్న మద్యాన్ని ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు.











