ప్రొద్దుటూరులో హైటెన్షన్..! రోడ్డు నాణ్యతపై వైసీపీ ఆందోళన.. సీన్‌లోకి టీడీపీ.. రంగంలోకి పోలీసులు
ప్రొద్దుటూరు పట్టణంలో రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. పట్టణంలోని బొల్లవరం ప్రాంతంలో ఇటీవల నిర్మించిన నూతన రహదారి నాణ్యతపై వివాదం రేగింది. రోడ్డు నాసిరకంగా నిర్మించారని ఆరోపిస్తూ వైసీపీ నాయకుడు బంగారు రెడ్డి తన అనుచరులు, ఇతర ప్రతిపక్ష నాయకులతో కలిసి రహదారిని పరిశీలించారు.
ఈ సమాచారం తెలుసుకున్న టీడీపీ నాయకులు కూడా అక్కడికి చేరుకుని, ప్రభుత్వం ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే వైసీపీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. దీంతో ఇరు పార్టీల నాయకుల మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. కొంతసేపు బొల్లవరం ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు. ఇరుపక్షాల నాయకులను అక్కడి నుంచి పంపించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పరిస్థితిని పర్యవేక్షించారు.
రోడ్డు నాణ్యతపై ఆరోపణలు, వాటికి అధికార పార్టీ ప్రతిస్పందనతో ప్రొద్దుటూరులో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరగడం చర్చనీయాంశంగా మారింది.











