Home Telangana బీజేపీకి అనుబంధంగా ఈసీ రాజ్యాంగ సంస్థలపై కమలం ప్రభావం

బీజేపీకి అనుబంధంగా ఈసీ రాజ్యాంగ సంస్థలపై కమలం ప్రభావం


ఓటు హక్కు కోసం కాంగ్రెస్ సమరం
టీపీసీసీ చీఫ్ సంచలన ఆరోపణలు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2014 నుంచి రాజ్యాంగ సంస్థలను బలహీనపరుస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా బీజేపీ అనుబంధ సంస్థగా మారిందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌, సర్ ప్రక్రియపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండేలా చర్యలు తీసుకోవాలని, సర్ గడువును పొడిగించాలని ఈసీని కోరారు. ఈ ప్రక్రియలో పేదలు, సామాన్యులు తమ ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి రాకుండా స్పష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

అన్ని ఓట్లపై అనుమానాలా?

తెలంగాణలో సుమారు 3.38 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని మహేష్ గౌడ్ తెలిపారు. ఓటర్ల జాబితాలో భారీ స్థాయిలో వ్యత్యాసాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. 32.37 లక్షల ఓటు రికార్డులు ‘అన్‌మ్యాప్డ్’గా, మరో 60.50 లక్షల రికార్డులు ‘అనామలీస్’గా గుర్తించారని చెప్పారు. ఈ రెండు విభాగాల్లో కలిపి సుమారు 92 లక్షల ఓటర్ రికార్డులు పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు. ఏఎస్‌బీడీ అంటే గైర్హాజరు, వేరే ప్రాంతానికి వెళ్లిన వారు, మరణించిన వారు, డూప్లికేట్ ఓటర్లుగా గుర్తించిన రికార్డుల విషయంలోనూ స్పష్టత ఇవ్వాలని కోరారు. సుమారు 1.6 కోట్ల ఓటర్ రికార్డులను ఎందుకు పరిశీలనకు పెట్టారు? అర్హులైన ఓటర్లను తొలగించే అధికారం ఎవరికుంది? అని మహేష్ గౌడ్ ప్రశ్నించారు.

పేదల ఓటు హక్కుకు ముప్పు

2002 నాటి ఓటింగ్ రికార్డులకు సంబంధించిన నిబంధన కారణంగా పలువురు ప్రజలు ఎన్యుమమరేషన్ ఫారాలు పొందలేకపోతున్నారని మహేష్ గౌడ్ ఆరోపించారు. దీంతో అర్హత ఉన్న ప్రజలు ఓటర్ల జాబితా నుంచి బయటపడే ప్రమాదం ఉందన్నారు. కాంగ్రెస్ సుమారు 35 వేల బూత్ లెవల్ ఏజెంట్లను నియమించినా, ఈసీ కేవలం 13,100 మందిని మాత్రమే గుర్తించిందని తెలిపారు. అవసరమైన జాబితాలు, రసీదులు సమర్పించిన తర్వాత కూడా వ్యత్యాసాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అనామలీస్, అన్‌మ్యాప్డ్ విభాగాల్లో ఉన్న ప్రతి ఓటు వివరాలను ఈసీ బహిరంగంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది కాబట్టి ఒక్క అర్హుడి ఓటు కూడా తొలగించకూడదని, తెలంగాణలో సర్ ప్రక్రియకు మరింత సమయం ఇచ్చి పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు.

 

#MaheshKumarGoud #TPCC #Congress #TelanganaSIR #SIR #ElectionCommission #ECI #VoterRights #TelanganaVoters #VoterList #TelanganaPolitics #CongressTelangana #BJP #ElectionCommissionIndia #SpecialIntensiveRevision #ElectoralRolls #VotingRights #VoterVerification #TelanganaElections #IndianPolitics