తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జూలై 15 నుంచి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) హెల్త్ కార్డులు అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈహెచ్ఎస్ ద్వారా ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో ఉద్యోగులు, పెన్షనర్లు నగదు రహిత వైద్య సేవలు పొందనున్నారు. పథకం సమర్థవంతమైన అమలుకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హెల్త్ కార్డుల పంపిణీ చేపట్టనున్నారు. ఈ నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు స్వాగతిస్తూ, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు పరిష్కారం లభించిందని హర్షం వ్యక్తం చేశాయి.









