Home General క్యాంపస్‌లో డ్రగ్స్ యాజమాన్యానిదే బాధ్యత

క్యాంపస్‌లో డ్రగ్స్ యాజమాన్యానిదే బాధ్యత


కఠిన చట్టాలతోనే కట్టడి
డ్రగ్స్‌పై రేవంత్ కఠిన హెచ్చరిక

రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణకు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థల క్యాంపస్‌లలో డ్రగ్స్‌కు సంబంధించిన ఏ ఘటన జరిగినా ఆయా యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అవసరమైతే ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడంపై అధ్యయనం చేయాలని సూచించారు.

యాజమాన్యాలకు బాధ్యతలు

ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో జరిగిన రాష్ట్ర మాదక ద్రవ్యాల నిరోధం, భద్రత కమిటీల సమీక్ష సమావేశంలో సీఎం కీలక ఆదేశాలు ఇచ్చారు. క్యాంపస్‌లోనే కాకుండా బయట జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను కూడా గుర్తించి పోలీసులకు సమాచారం అందించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గుర్తించే ప్రత్యేక విభాగాన్ని ప్రతి విద్యా సంస్థలో ఏర్పాటు చేయాలని సూచించారు.

టోల్‌ఫ్రీ, క్యూఆర్ కోడ్ ఏర్పాటు

డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం సులభంగా అందేలా ప్రతి విద్యా సంస్థలో టోల్‌ఫ్రీ నంబర్, ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. డ్రగ్స్‌ను గుర్తించడం, వినియోగాన్ని మాన్పించడం, నేరస్థులను శిక్షించడం అనే మూడు దశల్లో సమర్థవంతమైన వ్యవస్థను అమలు చేయాలని ఆదేశించారు. డ్రగ్స్ తీసుకుని పట్టుబడిన విద్యార్థులను ముందుగా డీ-అడిక్షన్ కేంద్రాలకు పంపించి కౌన్సెలింగ్ ఇవ్వాలని, అదే తప్పును పదేపదే చేస్తే కఠిన శిక్షలు విధించే విధానాన్ని రూపొందించాలని సీఎం సూచించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు, ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్యతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

#RevanthReddy #Telangana #CampusDrugs #DrugControl #EducationalInstitutions #StudentSafety #AntiDrugCampaign #DrugFreeCampus #DeAddiction #TelanganaNews