ఇంటర్నెట్ డయాగ్నసిస్‌పై రాజ్‌నాథ్ చురక.
ఇంటర్నెట్ సెర్చ్‌లు, చాట్‌జీపీటీ ఆధారంగా సొంతంగా వ్యాధులను నిర్ధారించుకునే ధోరణి పెరుగుతోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. నోయిడాలో మహాజన్ ఇమేజింగ్ అండ్ ల్యాబ్స్ ఇంటిగ్రేటెడ్ డయాగ్నస్టిక్స్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ఆరోగ్యం గురించి ప్రజల్లో అవగాహన పెరగడం మంచిదేనని, అయితే ఇంటర్నెట్‌లో లక్షణాలను వెతికి వెంటనే ఒక వ్యాధికి వచ్చేయడం సమస్యగా మారుతోందన్నారు. స్వల్పంగా ఛాతిలో నొప్పి వచ్చిన వ్యక్తి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసి తీవ్రమైన గుండె వ్యాధి ఉందని భయపడవచ్చని, వాస్తవానికి ఆందోళన, కండరాల సమస్యలు వంటి సాధారణ కారణాలు కూడా ఉండొచ్చని వివరించారు.
‘ధక్ ధక్’ అంటే ఏంటి డాక్టర్?
ఇంటర్నెట్ పరిశోధనతో డాక్టర్ దగ్గరకు వచ్చే కొందరు తమ లక్షణాలు చెప్పడం కంటే తామే నిర్ధారించుకున్న వ్యాధి పేరును వైద్యుడికి చెబుతున్నారని రాజ్‌నాథ్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోగులు తమ సమస్యలను స్థానిక పదాలతో వివరించడం వల్ల కూడా వైద్యులకు సవాళ్లు ఎదురవుతాయని చెప్పారు. దీనికి ఉదాహరణగా ఓ వ్యక్తి ఛాతిలో ‘ధక్ ధక్’గా ఉందని చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. వైద్య విద్యలో ‘ధక్ ధక్’ అనే లక్షణం ఉండదని చమత్కరించారు. ఇంటర్నెట్‌లో లక్షణాలు చదివి తనకు క్లాస్ట్రోఫోబియా ఉందని భావించిన మరో వ్యక్తి ఎంఆర్‌ఐ పరీక్షకు వెంటనే అంగీకరించాడని చెప్పారు. నిజంగా క్లాస్ట్రోఫోబియా ఉంటే ఎంఆర్‌ఐకి అంగీకరించేవాడా అని డాక్టర్ ప్రశ్నించారని తెలిపారు.
టెక్నాలజీకి మానవత్వం తోడవాలి
ఆధునిక వైద్య పరికరాలు శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడంలో ఎంతో సహాయపడుతున్నా, రోగి మనసులోని భయం, ఆందోళన, ఆశను అర్థం చేసుకునే యంత్రం ఇంకా లేదని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. టెక్నాలజీతో పాటు వైద్యుల అనుభవం, సున్నితత్వం, మానవత్వం కూడా అవసరమని స్పష్టం చేశారు. ఏఐ, డిజిటల్ డయాగ్నస్టిక్స్ విస్తరిస్తున్న నేపథ్యంలో రోగుల ఆరోగ్య సమాచారం అత్యంత సున్నితమైనదని, దాని గోప్యతను కాపాడటం వైద్య రంగం బాధ్యత అని చెప్పారు. అనవసర పరీక్షలు, తప్పుడు నివేదికలు, తప్పు నిర్ధారణలకు తావులేకుండా రోగి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. వైద్య సేవలు పొందే వ్యక్తిని కేవలం ఒక నంబర్‌గా కాకుండా నమ్మకం, భయంతో వచ్చిన మనిషిగా చూడాలని సూచించారు.
#RajnathSingh #ChatGPT #ChatGPTDiagnosis #SelfDiagnosis #InternetDiagnosis #AIinHealthcare #HealthcareTechnology #MedicalDiagnosis #DigitalDiagnostics #PatientSafety #HealthTech #AIHealthcare #MedicalTechnology #HealthInformation #Noida #RajnathSinghSpeech #HealthcareNews











