సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్ తన వీడ్కోలు ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. “న్యాయమూర్తులు దేవుళ్లు కారు.. ప్రతి తీర్పు సరైనదే అవుతుందని చెప్పలేం” అని స్పష్టం చేశారు. న్యాయమూర్తి బాధ్యత కేవలం చట్టాన్ని సరిగ్గా వర్తింపజేయడం కాదని, న్యాయం జరిగేలా చూడటమే అసలు లక్ష్యమని చెప్పారు. కోర్టుకు వచ్చే వ్యక్తిని కేవలం పిటిషనర్‌గా చూడకుండా, అతని వెనుక ఉన్న మనిషిని అర్థం చేసుకోవాలని సూచించారు. న్యాయ ప్రక్రియకు వినయం, బాధ్యత, నిజాయితీ చాలా అవసరమని జస్టిస్ కరోల్ పేర్కొన్నారు.
కేసు వెనుక మనిషిని చూడాలి
దాదాపు 40 ఏళ్ల న్యాయ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్న జస్టిస్ కరోల్.. 19 ఏళ్ల పాటు న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. కోర్టులో వినిపించే వాదనలతో పాటు వినిపించని మాటలను కూడా న్యాయమూర్తులు అర్థం చేసుకోవాలని అన్నారు. ఒక పిటిషన్‌లో కేసు వాస్తవాలు మాత్రమే కనిపిస్తాయని, ఆ వ్యక్తి ఇప్పటికే ఏం కోల్పోయాడు.. కోర్టు నుంచి ఏం ఆశిస్తున్నాడో ప్రతి పత్రం చెప్పలేదని వివరించారు. 1996లో తొలిసారి సుప్రీంకోర్టు కోర్టు నంబర్-1లోకి వెళ్లినప్పుడు బెంచ్ దాదాపు ఆరు అడుగుల ఎత్తులో కనిపించిందని గుర్తుచేసుకున్నారు. అయితే ఆ ఎత్తు అధికారానికి గుర్తు కాదని, బాధ్యతకు ప్రతీకగా భావించానని చెప్పారు.
సాధారణ పౌరుడే అత్యున్నత స్థానం
సుప్రీంకోర్టు గొప్పతనం భవనం, బెంచ్ లేదా అధికారంలో లేదని.. న్యాయం కోసం తలుపు తట్టే సాధారణ పౌరుడి నమ్మకంలో ఉందని జస్టిస్ కరోల్ అన్నారు. కోర్టుకు చేరుకోలేని పేదలు, న్యాయం ఖరీదైనదిగా భావించే ప్రజలను కూడా వ్యవస్థ గుర్తుంచుకోవాలని సూచించారు. రాజ్యాంగం జీవించే పత్రం మాత్రమే కాదని, దాన్ని మన రోజువారీ ప్రవర్తనలో ఆచరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. న్యాయమూర్తి అంటే కేవలం నల్ల కోటు ధరించిన వ్యక్తి కాదని, అధికారాన్ని ఉపయోగించే ప్రతి ఒక్కరూ తమ నిర్ణయాల్లో న్యాయాన్ని పాటించాలని అన్నారు. చివరగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదా నుంచి తప్పుకుని “సాధారణ పౌరుడు అనే అత్యంత గౌరవమైన స్థానానికి తిరిగి వెళ్తున్నాను” అంటూ భావోద్వేగంగా వీడ్కోలు పలికారు. ఆయన 2023 ఫిబ్రవరి 6న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
#JusticeSanjayKarol #SupremeCourt #IndianJudiciary #JudicialAccountability #JudicialHumility #Justice #Judgment #SupremeCourtJudge #FarewellSpeech #Constitution #LegalNews #Judiciary #JusticeOverJudgment #JudicialProcess #India











